Pakistan : పుల్వామా ఉగ్రదాడిలో మా హస్తం ఉంది: పాక్ వాయుసేనాధికారి అంగీకారం
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ డిఫెన్స్ మీడియా వింగ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ.. "పుల్వామాలో మా వ్యూహాత్మక చతురతను స్పష్టంగా చూపించాం. అద్భుతమైన ఎత్తుగడలు అమలు చేశాం.
- By Latha Suma Published Date - 02:13 PM, Sun - 11 May 25

Pakistan : పుల్వామా దాడి వెనుక తమ పాత్ర ఉందని పాకిస్థాన్ తాజాగా బహిరంగంగా అంగీకరించింది. 2019లో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత పారామిలిటరీ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో పాకిస్థాన్ సంబంధం లేదంటూ నిరాకరించినప్పటికీ, ఇప్పుడు ఆ దేశ వాయుసేన అధికారి చేసిన వ్యాఖ్యలు నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి.
Read Also: Operation Sindoor : మే 12న హాట్‌లైన్‌లో భారత్-పాకిస్థాన్ చర్చలు..!
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ డిఫెన్స్ మీడియా వింగ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ.. “పుల్వామాలో మా వ్యూహాత్మక చతురతను స్పష్టంగా చూపించాం. అద్భుతమైన ఎత్తుగడలు అమలు చేశాం. మేము మా దేశ భద్రత, గౌరవం కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం” అని పేర్కొన్నారు. లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి, నేవీ ప్రతినిధి సమక్షంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకాలం ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదంటూ ఇస్లామాబాద్ చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు పూర్తిగా అసత్యమని వెల్లడైంది. పుల్వామా దాడి విషయంలో తమ ప్రమేయం లేదని అప్పట్లో పాకిస్థాన్ తీవ్రంగా బుకాయించినా, ఇప్పుడు పాక్ వాయుసేన ఉన్నతాధికారి స్వయంగా చేసిన ప్రకటన ఆ మాటలకు తూటా పొడి వేసింది.
ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడి నేపథ్యంలో కూడా పాక్ మౌనం పాటిస్తోంది. ఇది కూడా వారి సహకారానికి నిదర్శనంగా భావించవచ్చు. ఉగ్రవాదాన్ని రాజకీయ ఎత్తుగడగా ఉపయోగించుకుంటూ, మానవత్వాన్ని తాకట్టు పెట్టిన పాకిస్థాన్ తాజా ప్రకటనలతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటనలతో భారతదేశం ఎప్పటినుంచో చెబుతున్న వాదనకు బలమొచ్చింది. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు పాకిస్థాన్ ద్విచార ధోరణిని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకుల అభిప్రాయం.
Read Also: Alcohol Effect : వైసీపీ ఏలుబడిలో నాణ్యతలేని మద్యం.. 100 శాతం పెరిగిన కాలేయ వ్యాధులు !