India-Pak : భారత్, పాక్ చర్చలు వాయిదా.. ప్రధాని, అజిత్ దోవల్ కీలక చర్చలు
ఈ చర్చలు రెండు దేశాల 'డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్' (డీజీఎంవో)ల మధ్య హాట్‌లైన్ ద్వారా జరగనున్నాయి. అయితే ఈ ఆలస్యం వెనక గల కారణాలు అధికారికంగా వెల్లడించలేదు.
- By Latha Suma Published Date - 02:15 PM, Mon - 12 May 25

India-Pak : భారత్-పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, ఈ ఒప్పందం అనంతర పరిస్థితులపై కీలక చర్చలు వాయిదా పడ్డాయి. సోమవారం మధ్యాహ్నం జరగాల్సిన ఈ చర్చలు, ప్రస్తుతం ఈ సాయంత్రం 5 గంటలకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చర్చలు రెండు దేశాల ‘డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్’ (డీజీఎంవో)ల మధ్య హాట్‌లైన్ ద్వారా జరగనున్నాయి. అయితే ఈ ఆలస్యం వెనక గల కారణాలు అధికారికంగా వెల్లడించలేదు.
Read Also: Commission : సీఎం రేవంత్ రూ.20 వేల కోట్లు కమిషన్ నొక్కేసాడు..పక్క ఆధారాలు ఉన్నాయి – ఎమ్మెల్సీ కవిత
ఇదిలాఉంటే, భారత్ తలపెట్టిన చర్చల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో హైప్రొఫైల్ సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల చీఫ్‌లు మరియు ఇతర ఉన్నత స్థాయి సైనికాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం అజిత్ దోవల్ ప్రత్యేకంగా మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాక్‌తో చర్చలు, LOC పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టిసారించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కీలక వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్థాన్ బుల్లెట్లకు గట్టిగా ప్రతిస్పందించాలంటూ భారత సైన్యాన్ని ఆదేశించినట్లు సమాచారం. కశ్మీర్ అంశంలో పాక్‌తో ఏవైనా చర్చలు జరిగే అవకాశం లేదని, పీఓకే (పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్)ను భారత్‌కు అప్పగించడమే చర్చల ఏకైక మిషన్ అని మోదీ వ్యాఖ్యానించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు. ప్రస్తుతం నియంత్రణ రేఖ (LOC) వెంబడి శాంతియుత వాతావరణం నెలకొన్నది. అయితే ఈ ప్రశాంతత ఎంతకాలం నిలవనుంది, ముందే ఊహించడం కష్టం. కానీ ప్రతికూల పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. తీవ్రమైన అంశం: ఆర్మీ మాజీ చీఫ్