CM Chandrababu : ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఉచిత ఇసుక విధానం నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
- By Latha Suma Published Date - 07:34 PM, Mon - 21 October 24

Free Sand: రాష్ట్రంలోని ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు, లభ్యత పెంచేందుకు సీనరేజి రద్దు చేసినట్లు సీఎం పురుద్ఘాటించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో తరలింపు అధికంగా జరుగుతోందని, ఆయా మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ఠ పర్యవేక్షణ ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఉచిత ఇసుక విధానం నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ”గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపునకు అనుమతిచ్చాం. ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేయించాలి. రీచ్‌లలో తవ్వకాలు, లోడింగ్ ప్రైవేటుకు అప్పగింతపై ఆలోచించాలి” చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అనేక ప్రాంతాల్లో ఇసుక ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో, పటిష్ట పర్యవేక్షణతో పాటు చెక్‌పోస్టుల ఏర్పాటు చేయడం ద్వారా అక్రమ మార్గాల ద్వారా ఇసుక తరలింపును నియంత్రించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, పలు ప్రాంతాల్లో ఇసుక కొరత కారణంగా వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాముఖ్యతను ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించి, పర్యవేక్షణ విధానాలను కఠినంగా అమలు చేయాలని, ప్రజల అవసరాలను తీర్చేందుకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆయన సూచించారు.