CM Chandrababu : వనజీవి రామయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరే కోటి మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మొక్కలు నాటుతూ అడవులను సృష్టించిన రామయ్య సేవలు అమోఘమని కొనియాడారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
- By Latha Suma Published Date - 02:05 PM, Sat - 12 April 25

CM Chandrababu : ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రామయ్య ఇక లేరనే వార్త విని తీవ్ర విచారానికి లోనయ్యానని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరే కోటి మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మొక్కలు నాటుతూ అడవులను సృష్టించిన రామయ్య సేవలు అమోఘమని కొనియాడారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వనజీవి రామయ్య కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆయన చేసిన కృషి అసామాన్యమని చెప్పారు.
Read Also: Intelligence sources : దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక !
కాగా, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య(85) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. ఆయన తన జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్రను సృష్టించారు. 2017లో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. రోడ్ల పక్కన, పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాల్లో వనజీవి రామయ్య మొక్కలు నాటేవారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ ఆయన నిత్యం ప్రచారం చేసేవారు. మొక్కల ప్రేమికుడు రామయ్య, ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు.
మరోవైపు రామయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య ఆత్మకు నివాళిని సీఎం అర్పించారు. రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమని చెప్పుకొచ్చారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య అని తెలిపారు. రామయ్య మరణం సమాజానికి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
Read Also: Prithvi Shaw: గైక్వాడ్ స్థానంలో చెన్నై జట్టులో చేరనున్న పృథ్వీ షా?