High Court: నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటి?: హైకోర్టు
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎప్పుడు ఇస్తారని ఆరా తీసింది. దీనికి సమాధానంగా ఎన్నికల కమిషన్ తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదల చేస్తామని కోర్టుకు తెలియజేసింది.
- By Gopichand Published Date - 07:09 PM, Sat - 27 September 25

High Court: తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు (High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను ధర్మాసనం వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా, తాము మెరిట్స్ ఆధారంగా విచారణను కొనసాగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
గవర్నర్ నిర్ణయంపై హైకోర్టు ప్రశ్నలు
పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాలు, గవర్నర్ పాత్రకు సంబంధించి కీలక ప్రశ్నలను సంధించింది. ముఖ్యంగా బిల్లులు గవర్నర్ వద్ద నెల రోజుల పాటు పెండింగ్‌లో ఉంటే వాటికి సంబంధించిన జీఓలను ప్రభుత్వం విడుదల చేయవచ్చా అని ఏజీ (అడ్వకేట్ జనరల్) సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించింది. అలాంటి సందర్భాల్లో జీఓలు విడుదల చేయవచ్చని ఏమైనా కోర్టులు తీర్పులు ఇచ్చాయా అని ధర్మాసనం నిలదీసింది.
Also Read: SuryaKumar Yadav: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో సంచలన నిర్ణయం!
ఈ సందర్భంగా రిజర్వేషన్ బిల్లుల విషయంలో అనుసరించాల్సిన విధానంపై తాజా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. రిజర్వేషన్ బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలలు వేచి చూడాలని సూచించింది. ఒకవేళ ఆ మూడు నెలల కాలంలో గవర్నర్ ఆమోదించకపోతే ఆ బిల్లు ఆటోమేటిక్‌గా చట్టమవుతుందని స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం సన్నద్ధత, కోర్టు ప్రశ్న
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎప్పుడు ఇస్తారని ఆరా తీసింది. దీనికి సమాధానంగా ఎన్నికల కమిషన్ తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదల చేస్తామని కోర్టుకు తెలియజేసింది. అదే సమయంలో డివిజన్ బెంచ్ ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి “నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటని” ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ సన్నద్ధతను స్వాగతిస్తూనే నోటిఫికేషన్ వచ్చినా, ఈ రిజర్వేషన్ల పిటిషన్లను తమ ధర్మాసనం విచారిస్తుందని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. రిజర్వేషన్ల అంశం, ఎన్నికల ప్రక్రియ మధ్య ఉన్న లింక్‌ను బట్టి వచ్చే నెల 8న జరిగే విచారణ ఉత్కంఠభరితంగా మారింది.