BJP Vs BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆకర్ష్‌కు బీజేపీ నో.. ప్లాన్ అదేనా ?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌తో దూసుకుపోతోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను.. సాధ్యమైనంత త్వరగా తమ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది.
- By Pasha Published Date - 08:43 AM, Thu - 11 July 24

BJP Vs BRS : కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌తో దూసుకుపోతోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను.. సాధ్యమైనంత త్వరగా తమ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఆగస్టులో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాటికి చేరికల ప్రక్రియను పతాక స్థాయికి చేర్చాలని హస్తం పార్టీ యోచిస్తోంది. అంటే ఆలోగా మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ(Congress) తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ(BJP Vs BRS) మాత్రం సైలెంటుగా ఈ పరిణామాలు అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ సైలెన్స్ వెనుక దాగిన వ్యూహం ఏమిటి ? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join
ఆపరేషన్ ఆకర్ష్‌లు నిర్వహించే విద్య బీజేపీకి కూడా తెలుసు. తెలంగాణ పొరుగున ఉన్న మహారాష్ట్రలో శివసేన నేత ఏక్‌నాథ్ షిండే ద్వారా శివసేన పార్టీని రెండుగా చీల్చడం.. ఆ వెంటనే అక్కడి బీజేపీ ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండే చేరి సీఎం అయిపోవడం చకచకా జరిగిపోయాయి. దీన్నిబట్టి అటువంటి వ్యూహాలను రచించడంలో బీజేపీకి ఎంత నేర్పు ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో మాత్రం అంత దూకుడుతో వెళ్లాలని బీజేపీ ప్రస్తుతానికి భావించడం లేదని తెలుస్తోంది. ఇప్పట్లో చేరికలపై ఫోకస్ అవసరం లేదని కమలదళం పెద్దల నుంచి గైడెన్స్ వచ్చిందని సమాచారం. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో టెన్షన్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్‌కు.. బీజేపీ వ్యూహం ఒకింత ఊరటనిచ్చేలా ఉంది. బీఆర్ఎస్ తన ప్రధాన ప్రత్యర్ధిగా కాంగ్రెస్‌నే భావించేలా చేయాలనే ఏకైక వ్యూహంతోనే బీజేపీ ఇప్పుడు సైలెన్సుగా ఉండిపోయిందని పరిశీలకులు అంటున్నారు.
Also Read : JioTag Air : వస్తువులను పెట్టిన చోటును మర్చిపోతున్నారా ? ‘జియో ట్యాగ్ ఎయిర్’ తీసుకోండి
బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ బలహీనపరిస్తే పరోక్షంగా బలపడేది బీజేపీయే. అందుకే ఈ పరిణామాల్ని బీజేపీ చూడటానికి పరిమితం అవుతోంది. బీఆర్ఎస్ బలం తగ్గిపోతే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని చాలా చోట్ల బీజేపీ ఎదుర్కోవడం ఈజీ అయిపోతుంది. అందుకే బీఆర్ఎస్ బలహీనం కావడాన్ని చూస్తూ ఊరుకోవడమే ప్రస్తుతానికి మంచి వ్యూహమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. వాస్తవానికి ఇటీవల బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో చాలామంది బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన నేతలే ఉన్నారు. లోక్‌సభ పోల్స్‌లో బీఆర్ఎస్ బలహీనపడిన ప్రతీచోటా బీజేపీ బలం పెరిగింది. బీజేపీకి పోలయ్యే ఓట్లు పెరిగాయి. గతంలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించిన చాలా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. అందుకే బీఆర్ఎస్ వీక్ కావడం ఫ్యూచర్‌లో తమకు అడ్వాంటేజ్ అవుతుందని కమలదళం భావిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఏ సమస్యలూ లేని పార్టీ బీజేపీయే. కాంగ్రెస్ , బీఆర్ఎస్ యుద్ధంలో ఎవరు బలహీనపడిపోతే.. వారి బలం తమకే దక్కుతుందని బీజేపీకి అర్థమైపోయింది.