Gone Prakash Rao : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్యాపింగ్ బీఆర్ఎస్ పాలనలోనే
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది.
- By Kavya Krishna Published Date - 01:19 PM, Fri - 20 June 25

Gone Prakash Rao : తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపయ్యాయని అనుమానాలతో సిట్ అధికారులు వాస్తవాలను వెలికితీసేందుకు వరుస విచారణలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందని గుర్తించిన సిట్, ఆయనను వాంగ్మూలం ఇవ్వాలని కోరింది.
గోనె ప్రకాశ్ రావు శుక్రవారం ఉదయం 10:30కి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి హాజరై, సిట్ అధికారుల ఎదుట తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆదేశించిన పని అని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా “ఓటుకు నోటు” కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాక, బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డి వంటి తమ సొంత నాయకులే ట్యాపింగ్‌కు గురయ్యారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం తార్కికంగా తలపెట్టకుండా ఈ చర్యలకు పాల్పడిందని తీవ్ర విమర్శలు చేశారు.
దశాబ్దకాలం కొనసాగిన బీఆర్ఎస్ పాలనలో ఇదొక అత్యంత అవాంఛనీయ చర్యగా అభివర్ణించిన గోనె ప్రకాశ్ రావు, ఈ ఫోన్ ట్యాపింగ్ స్కాందే ప్రపంచంలో మూడో అతిపెద్దదని అన్నారు. ఈ ఆరోపణలతో కేసు చుట్టూ మరింత రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. సిట్ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే సూచనలున్నాయి.
Ind vs Eng : టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందన్న సచిన్