Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాటవేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు
- Author : Prasad
Date : 29-05-2026 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
రబీ వరి ధాన్యం సేకరణలో జాప్యం, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియా అడిగిన ప్రశ్నలకు తెలంగాణ మంత్రులు సమాధానం ఇవ్వకుండా సమావేశం నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను కొంతమంది సోషల్ మీడియా సంస్థలు అతిశయోక్తిగా ప్రచారం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని, కేంద్రం నిర్దేశించిన లక్ష్యానికి మించి రాష్ట్ర ప్రభుత్వం స్వంత నిధులతో కొనుగోళ్లు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్‌లో ఇప్పటివరకు 60 లక్షల టన్నుల వరి సేకరించామని, 75 లక్షల టన్నుల లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.1,150 కోట్లను జమ చేశామని, కనీస మద్దతు ధర చెల్లింపులు 49 నుంచి 78 గంటల్లో పూర్తవుతున్నాయని వివరించారు.
హమాలీల కొరత, వాహనాల లభ్యత సమస్యలు, గోనె సంచుల కొరత వంటి కారణాల వల్ల కొంత జాప్యం జరిగినా పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత షెడ్యూలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 11 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించిందని తెలిపారు. ఇతర పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన సహకారం అందించడం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలపై బీజేపీ నిర్వహిస్తున్న “రైతు గోస-బీజేపీ భరోసా” యాత్రపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సమావేశం చివర్లో విలేకరులు వరి సేకరణలో జాప్యం, గిడ్డంగుల నిల్వ సామర్థ్యం, కొనుగోలు కేంద్రాల వద్ద కోతలు, రైస్ మిల్లర్ల పాత్ర వంటి అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్‌మీట్ నుంచి బయటకు వెళ్లగా, ఆయనతో పాటు మిగిలిన మంత్రులు కూడా వాకౌట్ చేశారు. మంత్రులు తాము చెప్పదలుచుకున్నది చెప్పి.. మీడియా అడిగిన ప్రశ్నలను దాటవేస్తూ బయటికియ వెళ్లిపోయారు.