Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం..నియోజకవర్గానికి 5 వేల మందికి ఉపాధి!
రాజీవ్ యువ వికాసం ద్వారా రూ. 50వేల నుంచి రూ. 4లక్షల వరకు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నామని అన్నారు. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు.
- By Gopichand Published Date - 07:13 PM, Mon - 17 March 25

Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ సర్కార్ రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకాన్ని తాజాగా ప్రారంభించింది. “రాజీవ్ యువ వికాసం” (Rajiv Yuva Vikasam Scheme) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం మాట్లాడుతూ.. రూ.6000 కోట్లతో 5 లక్షల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసన సభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో ప్రారంభించుకున్నాం. ఈ 15 నెలల్లో 57 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. 50 లక్షల కుటుంబాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగులు చూస్తున్నాం. 43 లక్షల కుటుంబాలు రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 1 కోటి 30 లక్షల నాణ్యమైన చీరలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలోని 29,500 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డలకు అప్పగించాం. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ చెప్పారు. కులగణన నిర్వహించి ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకుంటున్నాం. కులగణనలో బీసీల లెక్క 56.36 శాతంగా తేలింది. వారికి 42 శాతం రిజర్వేషన్లు అందించాలి. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు బిల్లును కూడా సభ ముందుకు తీసుకొచ్చాం. దీనిని ఆమోదించుకుని ఎస్సీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. పరిపాలనను ప్రక్షాళన చేస్తూ.. పారదర్శక విధానంతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపదలచుకోలేదని అన్నారు.
Also Read: Hafiz Saeed : హఫీజ్ సయీద్ హత్యకు గురయ్యాడా ? నిజాన్ని పాక్ దాస్తోందా ?
దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని, ఇసుక, ఇతర విధానాలను స్ట్రీమ్ లైన్ చేస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో ఇసుకపై ప్రభుత్వానికి కోటిన్నర ఆదాయం వస్తే.. ఇవాళ ఇసుక ఆదాయం మూడున్నర కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, నిరుద్యోగ సమస్యను 8.8 నుంచి 6.6కు తెచ్చినట్లు తెలిపారు.
రాజీవ్ యువ వికాసం ద్వారా రూ. 50వేల నుంచి రూ. 4లక్షల వరకు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నామని అన్నారు. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. రాజీవ్ యువ వికాసం ద్వారా నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కలిగించొచ్చు అని, నిజమైన నిరుద్యోగులకు ఇది అందాలి.. వారికిది ఉపయోగపడాలన్నారు. ఉద్యోగాల భర్తీ, టీచర్ల బదిలీలు ఎలాంటి ఆరోపణ లేకుండా పారదర్శకంగా నిర్వహించామన్నారు. పథకాల అమలులో పారదర్శకంగా ఉండాలి.. అప్పుడే ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతాం. ఇది పార్టీ పథకం కాదు.. ప్రజల పథకం . ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు అని సీఎం పేర్కొన్నారు.