Food poisoning : 30న తెలంగాణలోని పాఠశాలల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
ఎన్నో రూపాల్లో విద్యార్థుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని, చలనం లేకపోవడంతోనే స్కూళ్ల బంద్‌కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 07:06 PM, Thu - 28 November 24

SFI : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 30న పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు SFI రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపింది. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి, రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అని ప్రశ్నించారు. ఇంత మంది విద్యార్థులు మరణించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష చేయకపోవడం దారుణమన్నారు. విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరమన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖను చూస్తున్నారని, అయినా శాఖ నిర్వహణలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఎన్నో రూపాల్లో విద్యార్థుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని, చలనం లేకపోవడంతోనే స్కూళ్ల బంద్‌కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అక్టోబర్ 30న జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో దాదాపు 60 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని శైలజ (16) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లోనూ ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపాయి. ఈ స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ నెల 26న అదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే.