CM Revanth Reddy : దేశ రక్షణలో తెలంగాణ ముందడుగు వేసింది: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఈ స్టేషన్ నిర్మాణానికి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న 'ఈస్టర్న్ నావెల్ కమాండ్'కు ఆరు నెలల క్రితమే అప్పగించింది. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్‌తో పాటు టౌన్‌షిప్ నిర్మాణం కానుంది.
- By Latha Suma Published Date - 02:51 PM, Tue - 15 October 24

Damagundam Radar Center : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడర్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దేశంలోనే అతిపెద్ద రెండో వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ సెంటర్‌గా దీన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. శంకుస్థాపన స్థలానికి చేరుకున్న రాజన్‌నాథ్ సింగ్‌కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ స్టేషన్ నిర్మాణానికి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ‘ఈస్టర్న్ నావెల్ కమాండ్’కు ఆరు నెలల క్రితమే అప్పగించింది. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్‌తో పాటు టౌన్‌షిప్ నిర్మాణం కానుంది. ఇందులో పాఠశాలలు, ఆసుపత్రి, బ్యాంక్, మార్కెట్ వంటి సదుపాయాలుంటాయి. నేవీ యూనిట్‌లో సుమారు 600 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉంటారు. మొత్తంగా ఈ టౌన్‌షిప్‌లో సుమారు 2,500-3,000 మంది నివసించే అవకాశముంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దామగుండం రిజర్వ్ ఫారెస్టు చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డును నిర్మించనున్నారు. కొత్త వీఎల్‌ఎఫ్ కేంద్రాన్ని 2027 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రానికి ఇది మరో ముందడుగన్నారు. డిఫెన్స్ సంస్థలకు వ్యూహాత్మకంగా హైదరాబాద్ సిటీ సేఫ్ ప్లేస్ అన్నారు. దామగుండంపై చాలా మంది వివాదాలు చేయాలని చూశారన్నారు . దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో ఎవరికీ నష్టం లేదన్నారు. తమిళనాడులో34 ఏళ్లుగా రాడార్ స్టేసన్ ఉన్నా ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు రేవంత్.
దేశ రక్షణ కోసం రాజీపడొద్దనే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయం.. కలిసి నడుస్తామన్నారు. దేశ రక్షణ కోసం పెడుతున్న ప్రాజెక్టులపై రాజకీయం చేసేవారు ఆలోచించాలన్నారు. రాడార్ స్టేషన్ నిర్మాణంలో ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. దేశభద్రత చాలా ముఖ్యమని.. రాడార్ స్టేషన్ పై కొందరు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని విమర్శించారు. పదేళ్లలో తెలంగాణను లూటీ చేసింది. మా ప్రభుత్వం రాడార్ కేంద్రానికి సహకరిస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ రాడార్ పై లేనిపోని ఆరోపణలు చేస్తుందని ప్రత్యేకంగా రాజ్ నాథ్ సింగ్ కి తెలిపారు.