TS Congress: రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్.. నిజంగా అంత సీనుందా?
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన నేతలతో పాటు ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొద్దికాలంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వేగంగా పుంజుకుంటూ వస్తోంది.
- By News Desk Published Date - 09:00 PM, Mon - 5 June 23

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్(Congress) పార్టీకి కర్ణాటక ఫలితాలు ఊపిరినిచ్చాయి. కన్నడనాట ఏ పార్టీతో పొత్తు అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ(BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తెలంగాణ(Telangana)లోని కాంగ్రెస్ శ్రేణుల్లో కర్ణాటక ఫలితాలు ఉత్సాహాన్ని నింపాయి. తెలంగాణలో ఈ ఏడాది చివరినాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణను ఎంచుకుంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), మల్లికార్జున ఖర్గే వంటి నేతలు తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
నిన్నమొన్నటి వరకు తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్(BRS)కు బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు భావిస్తూ వచ్చారు. కర్ణాటక ఫలితాల తరువాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతూ వచ్చింది. అంతేకాక, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన నేతలతో పాటు ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొద్దికాలంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వేగంగా పుంజుకుంటూ వస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడు రాజకీయాలకుతోడు ఇతర కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగం అందుకోవటంతో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదే అన్న దీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
రాహుల్ గాంధీసైతం తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని ధీమాతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆదివారం అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో చూద్దామన్నా బీజేపీ ఉండదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పార్టీని మట్టికరిపిస్తామని దీమాను వ్యక్తం చేశారు. అయితే, రాహుల్ గాంధీ పక్కా ఆధారాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణలో పలు దఫాల్లో నిర్వహించిన సర్వేల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేఖత వ్యక్తమైందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఈ దఫా అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలంతా ఏకమవుతున్నారని సర్వేల్లో వెల్లడైందని, ఈ సర్వేల ఆధారంగానే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై దీమాను వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ ను నింపాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.
Also Read : TSPSC Group-1: నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే.. గ్రూప్-1 పరీక్షలకు టీఎస్‌పీఎస్‌సీ పటిష్ఠ చర్యలు