SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ప్రధాని ఆరా..సీఎంకు ఫోన్..!
వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అవసరమైన సహాయక చర్యలన్నీ తీసుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
- By Latha Suma Published Date - 08:14 PM, Sat - 22 February 25

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేశారు. ప్రధానమంత్రికి పూర్తి వివరాలు అందించిన రేవంత్ రెడ్డి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించారు. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అవసరమైన సహాయక చర్యలన్నీ తీసుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Read Also: Shaktikanta Das : ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఆర్బీబీ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్
అయితే ఏ సహాయం కావాలని అందివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఎన్డీఆర్‌ఎఫ్ టీంను పంపిస్తున్నట్టు తెలిపారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కలిసి పనిచేద్దామని భరోసా ఇచ్చారు. ఇక, కాసేపట్లో ఎస్ఎల్ బీసీ టన్నెల్ దుర్ఘటన వద్దకు చేరుకోనున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. విజయవాడ నుండి 2, హైదరాబాద్ నుండి మరో టీంతో కలిసి ప్రమాద ఘటనా స్థలికి చేరుకోనున్నాయి ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ బృందాలు.
కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. అకస్మాతుగా పైకప్పు కూలింది. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. వారిలో 42 మంది బయటకి రాగా.. 8 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు.