Osmania University: అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ‘ఓయూ’కు 22వ స్థానం
ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు అడ్డా మాత్రమే కాదు.. అంతకుమించి చదువుల తల్లి కూడా.
- By Balu J Published Date - 11:38 AM, Sat - 16 July 22
 
                        ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు అడ్డా మాత్రమే కాదు.. అంతకుమించి చదువుల తల్లి కూడా. ఈ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది ఐఎఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నత ఉద్యోగాలకు ఎంపికై ఓయూ ఘనతను చాటారు. అందుకే ఓయూ చదువుకునేందుకు దేశ విదేశాల నుంచి స్టూడెంట్స్ క్యూ కడుతున్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలు అందిస్తూ ఓయూ తెలంగాణలో ముందుంది. తాజాగా ఈ యూనివర్సటీ మరో ఘనతను సాధించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ 2022 (NIRF 2022) ఫలితాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ న్యూఢిల్లీలో విడుదల చేశారు. యూనివర్శిటీల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ 22వ స్థానంలో, ఓవరాల్ విభాగంలో 46వ స్థానంలో నిలిచింది.
ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణలోనే అత్యుత్తమ స్టేట్ యూనివర్సిటీగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ‘భారతదేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి స్థానం దక్కడం శుభసూచకం.ఈ ర్యాంకింగ్ గత సంవత్సరం కంటే మెరుగుపడింది. ఓయూ ఘనత విస్తరిస్తుందని యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ వ్యాఖ్యానించారు. అందకు కారణమైన అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. అదేవిధంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కూడా ఇంజినీరింగ్ కాలేజీల విభాగంలో మంచి పనితీరు కనబరిచింది. ఇది 117వ స్థానంలో నిలిచింది.
 
                    



