Bullet Bikes : డుగ్.. డుగ్.. ఫట్.. ఫట్.. బుల్లెట్ బైక్‌లపై కొరడా
సాధారణంగానైతే బుల్లెట్ బైక్(Bullet Bikes)లలో మామూలు సౌండే ఉంటుంది. ఫట్.. ఫట్ అంటూ సౌండ్స్ ఏవీ రావు.
- By Pasha Published Date - 01:50 PM, Sun - 6 April 25

Bullet Bikes : డుగ్.. డుగ్.. డుగ్.. ఫట్.. ఫట్.. అంటూ భారీ సౌండ్స్‌తో దూసుకుపోయే బుల్లెట్ బైక్‌లకు చెక్ పెట్టే ప్రక్రియ మొదలైంది. అంత భారీ సౌండ్స్ విని ప్రజల చెవుల్లోని కర్ణభేరులు దెబ్బతింటున్నాయి. ఎంతోమంది వినికిడి శక్తిని కోల్పోతున్నారు. గుండె జబ్బులు, దడ కలిగిన వారు అకస్మాత్తుగా అలాంటి సౌండ్స్ విని ఆగమాగం అవుతున్నారు. చెమటలు కక్కుతున్నారు. పిల్లలు, ముసలివారు కూడా ఆ సౌండ్స్‌తో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈవిధంగా బాధపడిన ఎంతోమంది నుంచి పోలీసులకు ఎన్నో ఫిర్యాదులు అందాయి. దీంతో అలాంటి బైక్‌లపై కొరడా ఝుళిపించే పనిని తెలంగాణ పోలీసులు మొదలుపెట్టారు.
Also Read :BJP Formation Day : బీజేపీ 45 వసంతాలు.. కమలదళం ఎలా ఏర్పాటైందో తెలుసా ?
వేస్ట్ ఖర్చు.. అందరికీ అసౌకర్యం
సాధారణంగానైతే బుల్లెట్ బైక్(Bullet Bikes)లలో మామూలు సౌండే ఉంటుంది. ఫట్.. ఫట్ అంటూ సౌండ్స్ ఏవీ రావు. బుల్లెట్ బైక్‌లను సాధారణ తరహా సైలెన్సర్‌తోనే షోరూం వాళ్లు విక్రయిస్తుంటారు. వాటిలో ఎలాంటి ఎక్స్‌ట్రా ఎఫెక్టులు ఉండవు. అయితే ఈతరం కుర్రకారు బుల్లెట్ బైక్‌లను కొన్నాక.. తమదైన స్టైల్‌లోకి వాటిని మోడిఫై చేయిస్తున్నారు. ఈక్రమంలో షోరూం నుంచి వచ్చే సైలెన్సరును తీయించి, భారీ సౌండ్స్‌ను ఇచ్చే మోడిఫైడ్ సైలెన్సరును బిగించుకుంటున్నారు. ఇందుకోసం అదనంగా ఖర్చు వచ్చినా భరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆనందం కోసం ఆ ఎక్స్‌ట్రా డబ్బులను భరించేందుకు రెడీ అయిపోతున్నారు. అదంతా వేస్ట్ ఖర్చు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ మోడిఫైడ్ సైలెన్సర్ల వల్ల ఇతరులు అసౌకర్యానికి గురవుతారనేది తెలుసుకోవడం లేదు. ఇలాంటి మోడిఫైడ్ బుల్లెట్ బైక్‌ల నుంచి వచ్చే భారీ సౌండ్స్ వల్ల వాహనదారులు డ్రైవింగ్‌పై ఏకాగ్రతను కోల్పోతున్నారు. ఫలితంగా వారు వాహనంపై అదుపును కోల్పోయే ముప్పు ఉంటుంది.
Also Read :Nithyananda : నిత్యానంద స్వామి లొకేషన్ అదే.. ఎక్కడికీ వెళ్లలేడు !?
షోరూం సైలెన్సర్‌కే జై
ఈ తరహా బుల్లెట్ బైకులను నడిపే వారిపై కేసులు పెడతామని రాచకొండ పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, పలువురిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నగరం సమీపంలోని చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు నెల రోజుల వ్యవధిలో ఇలాంటి 80 బుల్లెట్ వాహనాలను గుర్తించి కేసులు పెట్టారు. ఇలా గుర్తించిన బుల్లెట్ బైకులకు అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్‌ను పోలీసులు తీసేస్తున్నారు.షో రూం నుంచి వచ్చే మరో సైలెన్సర్‌ను తెచ్చి బిగించుకున్నాకే బుల్లెట్ బైక్‌ను వాహనదారుడికి అప్పగిస్తున్నారు.