నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్
మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
- Author : Latha Suma
Date : 29-01-2026 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
. 10 మందిపై అభియోగాలు.. రూ.11.30 కోట్ల ఆస్తుల గుర్తింపు
. నయీం భార్య, కుటుంబ సభ్యుల పేర్ల ప్రస్తావన
. నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని ఈడీ వినతి
Gangster Nayeem: ఏపీ, తెలంగాణలో ఒకప్పుడు తీవ్ర సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక అడుగు వేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో నయీం అక్రమ సంపాదనపై దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశముంది. ఈ కేసులో నయీం అనుచరులు, సహాయకులుగా గుర్తించిన పాశం శ్రీనివాస్‌తో పాటు మొత్తం 10 మందిపై ఈడీ ఆరోపణలు మోపింది. నేరుగా నయీం కాకుండా అతని నెట్‌వర్క్ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలే ఈ కేసుకు కేంద్ర బిందువుగా మారాయి. కోర్టు విచారణకు అనుమతి ఇవ్వడంతో త్వరలో నిందితులపై సమన్లు జారీ అయ్యే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
ఈడీ దర్యాప్తు ప్రకారం నయీం గ్యాంగ్ బెదిరింపులు, బలవంతపు రిజిస్ట్రేషన్లు, అక్రమ ఒప్పందాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టింది. సుమారు రూ.11.30 కోట్ల విలువైన 91 ఆస్తులను ‘ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్’గా ఈడీ గుర్తించింది. ఈ ఆస్తులు నేర కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ఈ ఆస్తులను నయీం తన భార్య హసీనా బేగం, కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై బినామీగా నమోదు చేయించినట్లు అధికారులు నిర్ధారించారు. రియల్ ఎస్టేట్, ప్లాట్లు, భూములు వంటి అనేక ఆస్తులు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు ఈడీ అభియోగ పత్రంలో పేర్కొంది. ఇప్పటికే బినామీ లావాదేవీల చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ ఈ 91 ఆస్తులను అటాచ్ చేయగా తాజాగా వీటిని శాశ్వతంగా జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఈ కేసులో మరో కీలక అంశం ఏమిటంటే..నయీం కార్యకలాపాలకు సహకరించినట్టు అనుమానిస్తున్న రాజకీయ నాయకులు, కొందరు పోలీసు అధికారుల ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ దృష్టి సారించింది. నయీం గ్యాంగ్ అక్రమ సంపాదనను దాచిపెట్టేందుకు పెట్టుబడులుగా మార్చేందుకు ఈ వర్గాల సహాయం ఉందా? అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుగుతోంది. అనేకసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిందితులు విచారణకు హాజరుకాకపోవడం ఆదాయపు పన్ను రిటర్న్స్ కూడా దాఖలు చేయకపోవడంతో ఈడీ కఠినంగా వ్యవహరిస్తోంది. విచారణకు రాని వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును కోరినట్లు సమాచారం. ఛార్జిషీట్‌ను కోర్టు స్వీకరించిన నేపథ్యంలో ఈ కేసు మరో దశకు చేరింది. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఆస్తుల జప్తు జరిగే అవకాశాలు ఉండటంతో నయీం అక్రమాస్తుల కేసు మళ్లీ రాజకీయ పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.