జామ వర్సెస్ అవాకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..?.. రెండింటిలో ఏది బెస్ట్..?
100 గ్రాముల జామకాయలో సుమారు 68 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో విటమిన్ C అధికంగా ఉండటంతో పాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
- Author : Latha Suma
Date : 29-01-2026 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
. జామకాయలో తక్కువ క్యాలరీలు..అవకాడోలో మంచి కొవ్వులు
. బరువు తగ్గడం, జీర్ణక్రియ..జామకాయకు ప్లస్ పాయింట్
. రోగనిరోధక శక్తి, చర్మం..జుట్టు ఆరోగ్యం
Guava Vs Avocado: మన రోజువారీ ఆహారంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా జామకాయ, అవకాడో వంటి పండ్లు పోషక విలువల పరంగా ఎంతో సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ రెండు పండ్లు వేర్వేరు విధాలుగా మన శరీరానికి మేలు చేస్తాయి. బరువు తగ్గాలన్నా, రోగనిరోధక శక్తి పెంచుకోవాలన్నా, చర్మం–జుట్టు ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలన్నా ఏ పండు ఎంచుకోవాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో జామకాయ, అవకాడో లాభాలను వివరంగా తెలుసుకుందాం.
100 గ్రాముల జామకాయలో సుమారు 68 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో విటమిన్ C అధికంగా ఉండటంతో పాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో జామకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అవకాడో విషయానికి వస్తే..100 గ్రాములలో దాదాపు 160 క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఒలీక్ యాసిడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ K, విటమిన్ E, బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి తక్కువ క్యాలరీలతో ఎక్కువ ఫైబర్ కావాలంటే జామకాయ, మంచి కొవ్వులు కావాలంటే అవకాడో తినోచ్చు.
బరువు తగ్గాలనుకునే వారికి జామకాయ మంచి ఎంపిక. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉండటంతో ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీని వల్ల త్వరగా ఆకలి వేయదు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో కూడా జామకాయ సహాయపడుతుంది. అవకాడో ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు అవకాడోను పావు లేదా అర ముక్క పరిమితంగా తీసుకోవడం మంచిది. జీర్ణక్రియ మెరుగుపరుచుకోవాలనుకునే వారికి జామకాయ మరింత అనుకూలంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో జామకాయ ముందంజలో ఉంటుంది. ఇందులోని విటమిన్ C తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా జామకాయ మేలు చేస్తుంది. ఇక చర్మం, జుట్టు ఆరోగ్యం విషయంలో అవకాడో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని మృదువుగా ఉంచడంలో జుట్టు పొడిబారకుండా కాపాడడంలో సహాయపడతాయి. విటమిన్ E వల్ల చర్మానికి సహజమైన కాంతి వస్తుంది.
జామకాయ, అవకాడో రెండూ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పండ్లే. జామకాయ అందుబాటు ధరలో లభించి బరువు తగ్గడం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి అనువుగా ఉంటుంది. అవకాడో ధర కొంచెం ఎక్కువైనా గుండె, మెదడు, చర్మం–జుట్టు ఆరోగ్యానికి మంచి ఎంపిక. కాబట్టి మన శరీర అవసరాలు ఆర్థిక పరిస్థితిని బట్టి సరైన పండును ఎంపిక చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.