Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం
- Author : Vamsi Chowdary Korata
Date : 02-07-2026 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో నేటి నుంచి జూలై 8 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రాబోయే వారం రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, మరికొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు.
ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావం మొదటి రెండు రోజుల్లో తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. నేడు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
జూలై 3, 4 తేదీల్లో కూడా వర్షాల తీవ్రత కొనసాగనుందని చెప్పారు. జూలై 3న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. జూలై 4న రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తరిస్తాయన్నారు. జూలై 5న వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని… ఈ రోజున ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.
నిరంతరాయంగా కురిసే భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, నగరాల్లో రహదారులపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయని అన్నారు. వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. బలమైన గాలుల కారణంగా పాత ఇళ్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల విద్యుత్ సరఫరాకు, తాగునీటి వ్యవస్థలకు ఆటంకాలు ఏర్పడవచ్చునని చెప్పారు. జీహెచ్‌ఎంసీ సహా స్థానిక మున్సిపల్ సంస్థలు, పోలీస్, రహదారి, రైల్వే శాఖలు సమన్వయంతో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది.