Sada Bainama Lands: సాదా బైనామాలకు లైన్ క్లియర్.. తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులకు పరిష్కారం?!
సాదాబైనామాలపై హైకోర్టు స్టే ఎత్తివేయడం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనతో రైతులు తమ భూములకు చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయని ఆశిస్తున్నారు.
- By Gopichand Published Date - 05:02 PM, Wed - 20 August 25

Sada Bainama Lands: తెలంగాణలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాల (Sada Bainama Lands) దరఖాస్తులకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ హైకోర్టు సాదాబైనామాలపై గతంలో విధించిన స్టేను నిన్న ఎత్తివేయడంతో, వేలాది మంది రైతులు, భూ యజమానులలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంతో పెండింగ్‌లో ఉన్న తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది.
గతంలో ఏమి జరిగింది?
భూమి హక్కులను క్రమబద్ధీకరించడానికి ముఖ్యంగా సాదాబైనామాలను చట్టబద్ధం చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. 2020 నవంబర్ 10 వరకు రైతుల నుండి ఆన్‌లైన్‌లో సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అప్పట్లో అందాయి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టంలో సాదాబైనామాల అంశాన్ని స్పష్టంగా పొందుపరచకపోవడంతో, ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం మూసుకుపోయింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే విధించింది. ఫలితంగా ఈ అంశం గత కొన్నేళ్లుగా ముందుకు సాగలేదు.
Also Read: Jr. NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!
ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం, మంత్రి ప్రకటన
రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించింది. గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ, ఈ దరఖాస్తులను పరిశీలించి త్వరలో తగిన నిర్ణయం తీసుకోనుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే 4 లక్షల సాదాబైనామాలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇది రైతులకు పెద్ద ఊరట కలిగించే అంశమని, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉండిపోయిన సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రైతుల్లో ఆశలు
సాదాబైనామాలపై హైకోర్టు స్టే ఎత్తివేయడం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనతో రైతులు తమ భూములకు చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయని ఆశిస్తున్నారు. భూమి హక్కులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు పొందడంలో రైతులు గతంలో అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైతే వారికి ఆర్థికంగా, సామాజికంగా భరోసా లభిస్తుంది. ప్రభుత్వం త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారంతా కోరుతున్నారు.