Jr. NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!
తమ అభిమాన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను కలవాలని అనుకున్నామని, అయితే వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు.
- By Gopichand Published Date - 04:54 PM, Wed - 20 August 25

Jr. NTR Fans: జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిపై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల (Jr. NTR Fans) సంఘం హైదరాబాద్‌లో ఒక పత్రికా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభిమానుల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.
అడ్డుకునే ప్రయత్నాలను ఖండించిన అభిమానులు
పత్రికా సమావేశం ప్రారంభానికి ముందు తమను అడ్డుకోవడానికి కుట్రలు జరిగాయని అభిమానులు ఆరోపించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ నరేందర్ చౌదరి (అనంతపురం) మాట్లాడుతూ.. తమ అభిమాన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను కలవాలని అనుకున్నామని, అయితే వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమయంలో మౌనంగా ఉంటే అది తమ అసమర్థతగా భావిస్తామని, అందుకే ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని అన్నారు.
Also Read: Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 80 శాతం బోనస్!
దగ్గుబాటి వ్యాఖ్యలపై ఆగ్రహం
నరేందర్ చౌదరి మాట్లాడుతూ..”మా తల్లి లాంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని గారిని గురించి ఇలా మాట్లాడడం చాలా దారుణం. ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. ఏ తల్లిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గుబాటి ప్రసాద్ వెనుక నందమూరి టీడీపీ జెండా ఉంది కాబట్టే తాము కొంత సంయమనం పాటిస్తున్నామని, లేకపోతే ఆయనకు తగిన బుద్ధి చెప్పేవాళ్లమని హెచ్చరించారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తనకు ప్రాణహాని ఉందని వ్యాఖ్యానించడంపై కూడా అభిమానులు స్పందించారు. “ఫ్యాన్స్, పార్టీ మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. కానీ మా తల్లిని అంటే మాత్రం ఊరుకోము. మళ్లీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే, తగిన విధంగా స్పందిస్తాం” అని నరేందర్ చౌదరి అన్నారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
చివరగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తన వ్యాఖ్యలపై సిగ్గుపడి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభిమానులందరి సమక్షంలో అనంతపురంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆయన ఇంటి ముందు ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.