Telangana: భారీ వర్షాలు.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్
తెలంగాణాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాల ధాటికి నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి
- By Praveen Aluthuru Published Date - 06:12 PM, Wed - 19 July 23
Telangana: తెలంగాణాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాల ధాటికి నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక అనేక ప్రాజెక్టులలో భారీగా వర్షపు నీరు వచ్చి పడుతుంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంట్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి.
భారీ వర్షాల కారణంగా మంత్రి కేటీఆర్ అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన నానక్ రామ్ గూడలోని ఓ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం అయ్యారు. రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. అయితే భారీ వర్షాలు కురిసినా అధికారులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదంటూ సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలనీ ఆదేశించారు. మహా నగర పాలక సంస్థ ఇతర సంస్థలతో ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకొని సర్వసన్నద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Read More: Bat: వామ్మో.. మనిషి సైజులో వేలాడుతున్న గబ్బిలం.. నెట్టింట ఫొటోస్ వైరల్?