KCR Nalgonda Speech : ఎన్ని గుండెల్రా మీకు అంటూ కాంగ్రెస్ నేతలఫై కేసీఆర్ ఆగ్రహం
- By Sudheer Published Date - 07:56 PM, Tue - 13 February 24

కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభ (Nalgonda Public Meeting)లో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఫై నిప్పులు చెరిగారు. ఇది రాజకీయ సభ కాదు, పోరాట సభ అని నల్గొండ సభను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. ‘కృష్ణా, గోదావరి నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదని 24ఏండ్ల నుంచి నేను పక్షిలా తిరిగి రాష్ట్రానికి చెబుతున్నా. ఉన్న నీళ్లు కూడా సరిగా లేక నల్గొండలో బతుకులు వంగిపోయాయి. ఫ్లోరైడ్ బాధితులను తీసుకెళ్లి ఆనాటి ప్రధాని ముందు పడుకోబెడితే ఎవరూ పట్టించుకోలేదు. BRS ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్ రహితంగా చేసింది’ అని అన్నారు.
‘మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డరో.. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తీసుకొచ్చుకున్నరు అంటూ కాంగ్రెస్ కు ఓట్లు వేయడం ఫై కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మీరు ఓటు వేశారు..ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎలా నడుస్తుందో మీరు కళ్లారా చూస్తున్నారు. చిన్నచిన్న విషయాలు ఫర్వాలేదు. కానీ, మన జీవితాలను దెబ్బకొట్టి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పారు’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి రైతుబంధు ఇవ్వడానికి చేతకావట్లే..’ఇస్తే ఇచ్చినవ్ లేకపోతే లేదు. రైతుబంధు అడిగినందుకు రైతులను పట్టుకొని.. వాళ్లను చెప్పుతో కొట్టమని అంటవా? ఎన్ని గుండెల్రా మీకు? కండ కావరమా? కళ్లు నెత్తికెక్కినయా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటయ్. వాళ్ల చెప్పులు ఇంకా బందోబస్తుగ ఉంటయ్. ఒక్క చెప్పు దెబ్బతో మూడు పండ్లు ఊడిపోతయ్’ అని తీవ్రంగా స్పందించారు.
‘చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది. నా కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పోరాడతాను. పులిలాగ పోరాడుతాను కానీ పిల్లిలాగ పారిపోను. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే ఎంతైనా పోరాడవచ్చు. కరెంటు సమస్యను వెంటనే తీర్చాలి.. లేదంటే ప్రభుత్వాన్ని వదలం.. వెంటాడతాం’ అని హెచ్చరించారు. ‘నల్గొండ సభ ప్రకటించినప్పుడు కేసీఆర్ ను తిరగనీయమని అన్నారు. అంత మొగోళ్లా? కేసీఆర్ ను తిరగనీయరట..! తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయరా? ఏం చేస్తారు.. చంపేస్తారా? కేసీఆర్ను చంపి మీరు ఉంటారా? ఇది పద్ధతా?. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తుంది. మీకు దమ్ముంటే ఇంకా బాగా పాలించి చూపించండి’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
‘నంగనాచి అభాండాలతో తప్పించుకుంటే వదిలేది లేదు. చూస్తూ కూర్చోవడానికి ఇది మునుపటి తెలంగాణ కాదు.. ఇది టైగర్ తెలంగాణ. ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనివ్వం. కృష్ణా జలాల్లో సంపూర్ణ వాటా దక్కేదాకా వదలం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటన్నా మంచి పని చేస్తోందా? ప్రజలను ప్రశ్నించారు. కొందరు మంత్రులు సోయితప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉందని ఉత్తమ్ అంటున్నారు. కేసీఆర్ను తిడితే మీరు పెద్దవాళ్లు అయిపోతారా? అంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. తాము డబుల్ స్పీడ్ తో అధికారంలోకి వస్తామని , రాష్ట్రంలో అసెంబ్లీని కూడా జనరేటర్లు పెట్టుకొని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగాని తనమేనని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Also : Sai Dharam Tej : సాయి తేజ్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్.. ఆ సినిమా ఆగిపోలేదు షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..!