Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. త్రిముఖ పోరులో కీలకం కానున్న ఓటింగ్ శాతం!
నగరవాసులు, ముఖ్యంగా యువత, ఉద్యోగ వర్గాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో, పోలింగ్ శాతం పెరిగితే అది ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
- By Gopichand Published Date - 07:58 AM, Tue - 11 November 25
Jubilee Hills Bypoll: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ (Jubilee Hills Bypoll) మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే కేంద్రీకృతమైంది. 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరందరి కోసం ఎన్నికల సంఘం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (బీఆర్‌ఎస్) మరణం కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ప్రధాన అభ్యర్థులు, కీలక పోటీ
బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తరఫున దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్ రంగంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు బలమైన మద్దతు, స్థానిక పట్టు కలిగి ఉండటంతో పోటీ హోరాహోరీగా ఉంది. ఈ ఎన్నికలో విజయం సాధించి తమ బలాన్ని నిరూపించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి.
Also Read: Vipraj Nigam: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిని బెదిరించిన మహిళ..!
పోలింగ్ శాతంపై ఉత్కంఠ
ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం అత్యంత కీలక అంశంగా మారనుంది. గత ఎన్నికల రికార్డులను పరిశీలిస్తే జూబ్లీహిల్స్‌లో ఓటింగ్ శాతం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 50.18%, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 45.59%, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58% మాత్రమే నమోదైంది. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గం పరిధిలో తక్కువ ఓటింగ్ నమోదైంది.
నగరవాసులు, ముఖ్యంగా యువత, ఉద్యోగ వర్గాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో, పోలింగ్ శాతం పెరిగితే అది ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అధిక పోలింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. త్రిముఖ పోటీ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.