Jana Reddy : మంత్రి పదవుల రేసులోకి జానారెడ్డి.. ఎవరి కోసం ?
మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి జానారెడ్డి(Jana Reddy) లేఖ రాశారు.
- By Pasha Published Date - 07:47 PM, Tue - 1 April 25

Jana Reddy : జానారెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో దిగ్గజ నేత. ఒకప్పుడు పార్టీలో ఆయన చక్రం తిప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారాలపై ఫీడ్ బ్యాక్ కోసం హస్తం పార్టీ పెద్దలు జానారెడ్డిపై ఆధారపడేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక సీన్ పూర్తిగా మారింది. సీఎం రేవంత్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌పై పట్టు పెరిగింది. జానారెడ్డికి ఖిల్లా లాంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ లెక్కలు మారాయి. ప్రస్తుతం జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు జానారెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే తన కుమారుడి కోసం కాదు.. రంగారెడ్డి జిల్లా కోసం!! రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఆయనే మల్ రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నం నుంచి గెలిచారు.
Also Read :Ratan Tatas Will: రతన్ టాటా రూ.10వేల కోట్ల ఆస్తి.. ఎవరికి ఎంత ?
మల్ రెడ్డి రంగారెడ్డి సంప్రదించడం వల్లే..
మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి జానారెడ్డి(Jana Reddy) లేఖ రాశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత కేసీ వేణుగోపాల్‌లకు ఆయన లెటర్స్ రాశారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవిని కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని లేఖలో జానారెడ్డి పేర్కొన్నారు. ఈ లేఖ ద్వారా రెడ్డి వర్గం నుంచి మరొకరికి మంత్రిగా అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సంప్రదించడం వల్లే.. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అధిష్ఠానానికి జానారెడ్డి లేఖ రాశారని సమాచారం.
Also Read :Vodafone Idea : వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి 48.99 శాతం వాటా.. ప్రభుత్వ సంస్థగా మారుతుందా?
రెడ్డి వర్గం నుంచి తీవ్రపోటీ
రెడ్డి వర్గం నుంచి మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఇటీవలే మాదిగ, లంబాడి, బీసీ సామాజికవర్గాల ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాశారు. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు వినతులను పంపారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, నాలుగింటిని భర్తీ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న మంత్రి వర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది.