Hydra: హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ప్రతి సోమవారం ఫిర్యాదులు!
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చనుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో 684 గజాల స్థలంలో 8 అంతస్తుల ( G+5 రెండు సెల్లార్స్ కలిపి ) అక్రమ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది.
- By Gopichand Published Date - 06:47 PM, Sat - 4 January 25

Hydra: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరిని హడలెత్తిస్తున్న హైడ్రా (Hydra) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువులు పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంతో పాటు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందించేందుకు ఉద్దేశించిన హైడ్రా ఇప్పుడు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించడానికి సిద్ధమైంది. ఇందుకు ప్రతి సోమవారాన్ని( ప్రభుత్వ సెలవులు మినహాయించి)కేటాయించింది.
చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు ఇలా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసే క్రమంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులతో పాటు సలహాలను కూడా స్వీకరించడానికి ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలు తీసుకుని కార్యాయానికి రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఏమైనా సందేహాలుంటే 040- 29565758, 29560596 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం: బీఆర్ నాయుడు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా చర్యలు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చనుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో 684 గజాల స్థలంలో 8 అంతస్తుల ( G+5 రెండు సెల్లార్స్ కలిపి ) అక్రమ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది. అయ్యప్ప సొసైటీకి చెందిన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా చర్యలు తీసుకోనుంది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు హైడ్రా బృందాలు చేరుకున్నాయి. ఈరోజు రాత్రి కానీ, రేపు ఉదయం గానీ కూల్చివేతలు చేపట్టనున్నారు.