Hydra : కూకట్పల్లి నల్లచెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా యాక్షన్
అమీన్పూర్, కూకట్పల్లి ప్రాంతాల్లోని నల్లచెరువు ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో హైడ్రా(Hydra) అధికారులు కూల్చివేతలను నిర్వహిస్తున్నారు.
- By Pasha Published Date - 09:32 AM, Sun - 22 September 24

Hydra : హైదరాబాద్‌లో ఇవాళ ఉదయాన్నే హైడ్రా రంగంలోకి దిగింది. అమీన్పూర్, కూకట్పల్లిలోని అక్రమ కట్టడాలను కూల్చి వేసింది. కూకట్‌పల్లి పరిధిలోని నల్లచెరువు పక్కనున్న 16 నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని తేల్చిన హైడ్రా ఆఫీసర్లు.. రెండు రోజుల క్రితమే వాటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఈనేపథ్యంలో ఇవాళ భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు.
Also Read :Salt Tips : ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండెపై మాత్రమే కాకుండా ఈ అవయవానికి కూడా హాని కలుగుతుంది..!
అమీన్పూర్, కూకట్పల్లి ప్రాంతాల్లోని నల్లచెరువు ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా(Hydra) అధికారులు కూల్చివేయించారు. నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. అయితే దానిలో 7 ఎకరాల భూమి కబ్జాలకు గురైందని హైడ్రా తేల్చింది. బఫర్ జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఎఫ్‌టీఎల్‌లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. అయితే ప్రజలు నివసిస్తున్న భవనాలన్నీ వదిలేసి.. 16 షెడ్లను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. అమీన్‌పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ సర్వే నెంబర్ 164లో ఉన్న ఆక్రమణలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేయిస్తున్నారు.
Also Read :Liver Health Tips : తెల్లవారుజామున చేసే ఈ పొరపాట్లు కాలేయాన్ని డిస్టర్బ్ చేస్తాయి.!
మూసీ నది పక్కనున్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కూడా హైడ్రా మొదలుపెట్టనుంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదలతో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఉంది. 55 కిలోమీటర్ల మేర మూసీని సుందరికరించనుంది. మూసీ పరివాహక ప్రాంతంలో మొత్తం 12 వేల ఆక్రమణలను అధికారులు గుర్తించారు. వాటి తొలగింపుపై ఈరోజు నుంచే ‘హైడ్రా’ ఫోకస్ పెట్టింది. హైడ్రా కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయే మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించనుంది. మొత్తం మీద హైదరాబాద్‌లో కబ్జాకోరులకు హైడ్రా యాక్షన్‌తో చెక్ పడుతోంది. భవిష్యత్తులో ఎవరైనా హైదరాబాద్‌లో భూములు కబ్జాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావడం మంచి పరిణామం.