Deputy CM Bhatti: ఆయన రాజకీయం ఓ పాఠ్యాంశం.. డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఎల్బీలో గోల్డ్ మెడల్ సాధించి ఎల్ఎల్ఎం చదువుతున్న సమయంలో గ్రామానికి వెళ్లి అనేక సంస్కరణలు తీసుకురావడంతో గ్రామ ప్రజల ఒత్తిడి మేరకు సర్పంచ్ గా ధన్వాడ నుంచి పోటీ చేసి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు.
- By Gopichand Published Date - 10:29 PM, Sun - 2 March 25

Deputy CM Bhatti: హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన మాజీ డిప్యూటీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీపాదరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. గాంధేయవాదాన్ని, కాంగ్రెస్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తూ సాధారణమైన ప్రజా జీవితాన్ని గడిపిన డిప్యూటీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. గాంధేయవాదాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్య పాలనలో తనదైన ముద్ర వేసిన శ్రీపాదరావు జీవితం రాజకీయాల్లోకి రాణించే వారికి ఒక పాఠ్యాంశంగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభను డిప్యూటీ స్పీకర్ గా శ్రీపాద రావు చాలా గంభీరంగా నడిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దండులు కొలువైన శాసనసభలో ప్రభుత్వానికి కావాల్సిన సమయం ఇవ్వడంతో పాటు, ప్రతిపక్ష పార్టీలకు కూడా ప్రజల సమస్యలను శాసనసభలో చెప్పడానికి తగిన సమయం ఇచ్చేవారని తెలిపారు.
Also Read: CM Revanth: ఇది అనుకొని ప్రమాదం.. టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ సమీక్ష!
ఎల్ఎల్బీలో గోల్డ్ మెడల్ సాధించి ఎల్ఎల్ఎం చదువుతున్న సమయంలో గ్రామానికి వెళ్లి అనేక సంస్కరణలు తీసుకురావడంతో గ్రామ ప్రజల ఒత్తిడి మేరకు సర్పంచ్ గా ధన్వాడ నుంచి పోటీ చేసి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. మహాదేవపూర్ సమితి అధ్యక్షులుగా, మూడుసార్లు మంథని నుంచి శాసనసభ్యులుగా గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించి తనదైన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు. మంథని నియోజక వర్గం నుంచి శ్రీపాద రావు మూడుసార్లు, ఆయన కుమారుడు శ్రీధర్ బాబు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఆశా మాషి కాదు. ప్రజలతో వారు మమేకమవడం, జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేయడం వల్లనే ఎనిమిది సార్లు ఒకే కుటుంబానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు.
సామాజిక పరివర్తనలో భాగంగా భూసంస్కరణలు అమలు చేయడం వల్ల మంచి నాయకుడిగా ప్రజాదరణ పొంది ఈనాటి తరానికి ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో నేను డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన క్రమంలో నాకంటే ముందు బాధ్యతలు నిర్వహించిన స్పీకర్లు వారు శాసనసభను నడిపిన విధానం గురించి తెలుసుకొని ఆ విధంగా నడుపడానికి ప్రయత్నం చేశాను. శ్రీపాద రావు ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన కుమారుడు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను చాటుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ శాఖలకు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ కొంచెం సమయం దొరికిన అర్ధరాత్రి సమయాల్లో కూడా నియోజకవర్గానికి వెళ్లి తన తండ్రి అప్పగించిన ప్రజల సంక్షేమ బాధ్యతను కంటికి రెప్పలా చూసుకుంటున్నందునే శ్రీధర్ బాబు ఆ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు విజయం సాధించగలిగారు.
పోటీ ప్రపంచం, అనేక భావజాలాలు వ్యాప్తి, డబ్బు ప్రభావం ఉన్నప్పటికీ ఐదు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి శ్రీధర్ బాబు గెలవడం అనేది ఆషామాషీ కాదు. జనంతో మమేకం కావడం వల్లనే ఇది సాధ్యం. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి డిప్యూటీ స్పీకర్ శ్రీపాద రావుతో ఉన్న అనుబంధం గురించి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.