Quashes FIR Against KTR: కేటీఆర్ కేసు హైకోర్టులో కొట్టివేత.. అసలు ఏం జరిగిందంటే?
కేటీఆర్ తరపు న్యాయవాది టీవీ రమణారావు కోర్టులో వాదిస్తూ మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేదని తెలిపారు.
- By Gopichand Published Date - 03:39 PM, Mon - 21 April 25

Quashes FIR Against KTR: తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (Quashes FIR Against KTR)తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, బాల్క సుమన్‌లపై మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. ఈ కేసు 2024 జులై 26న మేడిగడ్డ బ్యారేజీ వద్ద అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేసి, ప్రాజెక్టును సందర్శించినందుకు సంబంధించినది.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్రోన్ ఉపయోగించి వీడియో తీసినట్లు ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వలి షేక్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మహదేవపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 223(b)తో పాటు సెక్షన్ 3(5) కింద కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన మేడిగడ్డ బ్యారేజీ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ఆయన అంత్యక్రియలు ఎలా చేస్తారంటే?
కేటీఆర్ తరపు న్యాయవాది టీవీ రమణారావు కోర్టులో వాదిస్తూ మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేదని తెలిపారు. ఈ కేసు రాజకీయ కక్ష్యలతో నమోదు చేయబడిందని, ఆరోపణలకు సంబంధిత ఆధారాలు లేవని వాదించారు. బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్శన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ విషయంలో వ్యాప్తి చేసిన అసత్యాలను ఖండించేందుకు ప్రజలకు వాస్తవాలను చూపించాలని ఉద్దేశించారని వివరించారు.
మరోవైపు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర రావు, మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతంగా ఉందని, అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం బ్యారేజీ భద్రతకు ముప్పు కలిగిస్తుందని వాదించారు. అయితే, ఈ ప్రాంతం నిషిద్ధ ప్రాంతంగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించబడలేదని, ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కోర్టు గమనించింది. ఇరువైపుల వాదనలను విన్న తర్వాత జస్టిస్ కే. లక్ష్మణ్ ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన సెక్షన్‌లకు తగిన అంశాలు లేనందున, ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులకు ఊరటనిచ్చింది.