Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి
- Author : Vamsi Chowdary Korata
Date : 11-07-2026 - 4:32 IST
Published By : Hashtagu Telugu Desk
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద్రాద్రి రాముని మీద గానీ, లేదా నీకు రాజకీయ భిక్ష పెట్టిన నీ మామ కేసీఆర్ (KCR) మీద గానీ ప్రమాణం చేసి చెప్పగలవా?” అని నిలదీశారు. హరీష్ రావు రాజకీయ వైఖరిపై ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
హరీష్ రావు అంతర్గత వ్యూహాలు మరియు ఆయన తీరుపై గతంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పూర్తి స్పష్టత ఉందని, అందుకే ఆయనను పార్టీ నుంచి గెంటేయాలని కేసీఆర్ భావించారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఏడాది కాలం పాటు హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకుండా కేసీఆర్ పక్కన పెట్టడానికి ఈ నమ్మకద్రోహ రాజకీయా లే కారణమని సీఎం గుర్తుచేశారు. అంతేకాకుండా, ఇటీవల కన్నెపల్లి ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. హరీష్ రావును తనతో పాటు ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. మామ, బావబామ్మర్దుల మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్లే హరీష్ రావు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.