Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?
ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడే సన్నాహాలు ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వ్యూహాలపై దృష్టి సారిస్తున్నాయి.
- By Gopichand Published Date - 03:01 PM, Sat - 30 August 25

Sarpanch Elections: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Sarpanch Elections) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు తాజాగా అధికారికంగా లేఖ రాసింది. ఈ లేఖతో స్థానిక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన లేఖ ఆధారంగా.. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని సూచించింది.
ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు దాదాపు ఐదేళ్లుగా ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ పాలక మండళ్ల కాలపరిమితి ముగియడంతో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అనేకసార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రక్రియ ఆలస్యమైంది. తాజా హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది.
Also Read: Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్.. హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రావిడ్!
ఓటర్ల జాబితాపై దృష్టి
ఎన్నికల సంఘం ప్రధానంగా ఓటర్ల జాబితాపై దృష్టి సారించింది. ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే వాటిని సవరించి, తుది జాబితాను త్వరగా ప్రచురించాలని ఆదేశించింది. గ్రామాలు, మండలాల వారీగా ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని అధికారులకు సూచించింది. ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడానికి ఇది చాలా ముఖ్యమని పేర్కొంది.
రాజకీయ పార్టీల స్పందన
ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడే సన్నాహాలు ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వ్యూహాలపై దృష్టి సారిస్తున్నాయి. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ఇది ఒక మంచి అవకాశం అని పార్టీలు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల బలాబలాలను, ప్రజల్లో ఉన్న ఆదరణను తెలియజేస్తాయి. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తమ గ్రామాలకు అవసరమైన సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు. ఎన్నికల నిర్వహణపై అధికారిక ప్రకటన వెలువడగానే రాజకీయ సందడి మరింతగా పెరుగుతుంది. ఈ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజాస్వామ్య ప్రక్రియకు బలం చేకూర్చనున్నాయి.