Konda Surekha: మరోసారి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి ఎవరికంటే?
సికింద్రాబాద్ లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు.
- By Gopichand Published Date - 11:47 PM, Tue - 22 October 24

Konda Surekha: తెలంగాణ గంగా జమునా సంస్కృతికి విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఎవరూ దేవాలయాలపై రాజకీయాలు చేయవద్దని మంత్రి సురేఖ విజ్ఞప్తి చేశారు. దైవాన్ని మతాల ప్రాతిపదన విభజింవద్దని హితవు పలికారు.
చారిత్మ్రకమైన ఈ హైదరాబాద్ నగరం మత సామరస్యతకు, సర్వమతాల సంరక్షణకు ఆలవాలంగా ఉండి, గంగా జమునా తెహజీబ్ ను కాపాడుకుంటూ వస్తుందని మంత్రి సురేఖ అన్నారు. సికింద్రాబాద్ లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు. నిందితునికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కారు చేతల ప్రభుత్వమని, మాటల ప్రభుత్వం కాదని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: AP Cabinet Meeting : రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
ఈ ఘటనలో కొంతమంది అల్లరి మూకలు చేరి, మతసామరస్యతకు భంగం కలిగేలా చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా చర్యలు చేపట్టిందని అన్నారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి దేవాదాయ శాఖ అధికారులను పంపించి సమగ్ర వివరాలు సేకరించినట్టు మంత్రి తెలిపారు.
మంగళవారం నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. మిగతా పార్టీల మాదిరి తాము గుడులపై, ప్రజల నమ్మకాలపై రాజకీయాలు చేయదలుచుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సికంద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించాలని ఆదేశించినట్టు మంత్రి సురేఖ వెల్లడించారు. ఇటువంటి ఘటనల పట్ల దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంయమనం పాటించాలనీ, హైదరాబాద్ నగర మత సామరస్యాన్ని కాపాడాలనీ మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.