Rahul Visit: తెలంగాణ రంగంలోకి రాహుల్!
తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఇప్పట్లో లేనప్పటికీ.. ప్రధాన రాజకీయ పార్టీలు ధర్నాలు, రాస్తారాకోలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి.
- By Balu J Published Date - 12:51 PM, Mon - 11 April 22

తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఇప్పట్లో లేనప్పటికీ.. ప్రధాన రాజకీయ పార్టీలు ధర్నాలు, రాస్తారాకోలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ వరి వార్ పై తమ ఆందోళనలను కొనసాగిస్తుంటే.. బీజేపీ పాదయాత్రలకు సిద్ధమవుతోంది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ సైతం ప్రత్యేక రాష్ట్రంపై పట్టు బిగించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ నెలాఖరున వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించింది. కాంగ్రెస్ అధిష్టానం కోరడంతో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ వరంగల్ సభకు హాజరయ్యేందుకు అంగీకరించారు.
రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటన ఖారరైంది. ఏప్రిల్ 25 నుంచి 27 మధ్య తేదీలను ఖరారు చేసేందుకు ఏఐసీసీ, టీపీసీసీ సమన్వయంతో పని చేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత డిసెంబర్‌లో వరంగల్‌లో రాహుల్‌తో సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ భావించింది. వివిధ కారణాల వల్ల సమావేశం కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో, కేంద్రంలోని టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, దళితులు, గిరిజనులు తదితర సమస్యలపై టీపీసీసీ వివిధ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించింది. వరి సేకరణలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తోంది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను విపరీతంగా పెంచడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, పార్టీ సమావేశాలు నిర్వహించనుంది. ఏప్రిల్ 12న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అదే రోజున టీపీసీసీ ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వరికి కనీస మద్దతు ధర కల్పించేందుకు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఇంధనం, గ్యాస్ ధరలు, విద్యుత్ ఛార్జీలు, వరిసాగు సమస్యలపై ఆందోళనలు చేసేందుకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20 వరకు ఆయా గ్రామాల్లో పర్యటించాలని రేవంత్ పార్టీ నేతలను ఆదేశించారు.