Congress Jana Garjana: వాహనాలను అడ్డుకోవడంతో పాదయాత్ర చేస్తూ ‘జన గర్జన’కు
తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నాలుగేళ్లుగా మెతకగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకొచ్చింది.
- By Praveen Aluthuru Published Date - 03:54 PM, Sun - 2 July 23

Congress Jana Garjana: తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నాలుగేళ్లుగా మెతకగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఇప్పటివరకు జరిగిన బై పోల్ లో ఏ మాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ ప్రస్తుతం అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడుతుంది. తెలంగాణాలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా చెప్పుకుంది. కానీ గత నెల కాలంలోనే తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు జరిగాయి.
ఇదిలా ఉండగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మంలో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టింది. ఈ సభకు అగ్రనేత రాహుల్ గాంధీ రాకతో శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో ఖమ్మం సభకు లక్షలాది మంది తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం సభను ప్లాప్ షోగా చేయాలనీ అధికార పార్టీ బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. సభకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ ఆడుకుంటున్న పరిస్థితి. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు, ఆర్టీఏ అధికారులు కలిసి చెక్ పోస్టులతో వారిని అడ్డగిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ సభకు తరలి వస్తున్నారు.
ఖమ్మం జన గర్జన సభకు వస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల వాహనాలను అడ్డుకుంటున్న నేపథ్యంలో వేలాది మంది పాదయాత్ర ద్వార సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిదని వారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన తెలంగాణ జన గర్జన బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
Read More: TDP : పలాసలో ఉద్రిక్తత.. టీడీపీ నేతలు గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్‌నాయుడు అరెస్ట్