బిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు సీఎం రేవంత్ వ్యూహాత్మక అడుగులు!
అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్ అంశం చర్చకు వస్తే KCR, BRSను నిలదీసేలా అధికారపక్షాన్ని CM రేవంత్ సన్నద్ధం చేశారు. విపక్షాన్ని చర్చకు ఆహ్వానిస్తూనే సభలో తాము ఎలా స్పందిస్తామనే క్లారిటీ ఇచ్చారు
- Author : Sudheer
Date : 02-01-2026 - 7:08 IST
Published By : Hashtagu Telugu Desk
- హాట్ హాట్ గా నడుస్తున్న అసెంబ్లీ సమావేశాలు
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చ
- కేసీఆర్, హరీష్ రావు లు టార్గెట్
తెలంగాణ శాసనసభ వేదికగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై జరగనున్న చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై విపక్ష బీఆర్ఎస్‌ను, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో సిద్ధమయ్యారు. కేవలం సభలో సమాధానం చెప్పడమే కాకుండా, అంతకంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి తాము అడగబోయే ప్రశ్నలను బహిర్గతం చేయడం రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం. ప్రతిపక్షం చర్చకు రాకుండా తప్పించుకోకుండా ఉండేలా సవాల్ విసరడం ద్వారా, సభలో పైచేయి సాధించేందుకు అధికార పక్షం ముందస్తు సన్నద్ధతను చాటుకుంది.

Kcr Assembly
ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి గత ప్రభుత్వ వైఫల్యాలే కారణమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం రేవంత్ రెడ్డి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పదేళ్ల కాలంలో ప్రాజెక్టు వ్యయం పెరగడం, పనుల నెమ్మది, మరియు డిజైన్ల మార్పులపై కేసీఆర్‌ను నిలదీయాలని రేవంత్ రెడ్డి తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. సాధారణంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటాయి, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా ప్రశ్నల జాబితాను సిద్ధం చేసి, “సభకు రండి.. సమాధానం చెప్పండి” అని సవాల్ చేయడం ద్వారా చర్చా దిశను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇది కేసీఆర్‌ను సభకు వచ్చేలా ఒత్తిడి తెచ్చే వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలు అసెంబ్లీ సమావేశాలపై రేవంత్ రెడ్డి వేస్తున్న వ్యూహాత్మక అడుగులుగా చర్చ సాగుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుపై విమర్శలను ఎదుర్కొంటూనే, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా రాజకీయ సమతుల్యతను కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నందున, ఈ చర్చలో సాధించే ఆధిక్యం రాబోయే ఎన్నికల్లో లేదా రాజకీయంగా మైలేజ్ ఇస్తుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే, సభలో కేసీఆర్‌ను డిఫెన్స్‌లో పడేసేలా అధికార పక్షం సర్వసన్నద్ధమైంది.