CM Cup : అక్టోబరు 2 నుంచి ‘సీఎం కప్’.. రాష్ట్రస్థాయికి ఎంపికైతే గోల్డెన్ ఛాన్స్
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న సీఎం కప్ పోటీలను ప్రారంభిస్తారని సమాచారం.
- By Pasha Published Date - 10:14 AM, Sun - 25 August 24

CM Cup : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. స్వతహాగా ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన రేవంత్ ఇకపై ప్రతి సంవత్సరం ‘సీఎం కప్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాపోటీలను నిర్వహించాలని భావిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయని తెలుస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న సీఎం కప్ పోటీలను ప్రారంభిస్తారని సమాచారం. దాదాపు 15 రోజుల పాటు పోటీలు కొనసాగుతాయని అంటున్నారు. సీఎం కప్ పోటీలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యే క్రీడాకారులను ఒలింపిక్స్‌కు పంపేలా శిక్షణ అందించే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకోనుందని అంటున్నారు. ఈ పోటీలపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
We’re now on WhatsApp. Click to Join
సీఎం కప్‌లో(CM Cup) విజేతలుగా నిలిచే క్రీడాకారులకు యంగ్ఇండియా వర్సిటీలో అడ్మిషన్లు ఇస్తారని తెలుస్తోంది. అక్కడ వారికి ఉచితంగా క్రీడాా శిక్షణ లభిస్తుంది. ఏదిఏమైనప్పటికీ తెలంగాణలో క్రీడారంగానికి మళ్లీ మంచిరోజులు మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. క్రీడా వసతులు ఎంత మెరుగుపడితే మన క్రీడాకారులకు అంతమేర ప్రయోజనం చేకూరుతుంది. అయితే ప్రతిభావంతులైన క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది.
Also Read :Tamil : ఆలయాల ఆచార వ్యవహారాల్లో తమిళానికి ప్రాధాన్యమివ్వండి : సీఎం స్టాలిన్
తెలంగాణలో ‘యంగ్ ఇండియా’ పేరుతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ వర్సిటీలో భవిష్యత్ ఒలింపిక్స్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేందుకు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో ఉండే స్పోర్ట్స్ హబ్‌కు మద్దతుగా స్పోర్ట్స్‌యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలాలను పరిశీలిస్తున్నారు. ఈ వర్సిటీలో ఒలింపిక్స్ స్థాయి శిక్షణా ప్రమాణాలతో క్రీడా వసతులు కల్పించనున్నారు. స్పోర్ట్స్ హబ్‌లో 12 క్రీడలకు సంబంధించి అకాడమీలు ఉంటాయి. స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ సైతం నిర్మిస్తారు.