Tamil : ఆలయాల ఆచార వ్యవహారాల్లో తమిళానికి ప్రాధాన్యమివ్వండి : సీఎం స్టాలిన్
రాష్ట్రంలోని ఆలయాల గర్భగుడిలో ప్రజల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని స్టాలిన్ స్పష్టం చేశారు.
- By Pasha Published Date - 09:41 AM, Sun - 25 August 24
Tamil : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల ఆచార వ్యవహారాల్లో తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని ఆలయాల గర్భగుడిలో ప్రజల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని స్టాలిన్ స్పష్టం చేశారు. దిండిగల్ జిల్లా పళనిలో రెండు రోజుల పాటు జరిగే ‘గ్లోబల్ ముత్తమిజ్ మురుగన్’ సదస్సును స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ‘‘డీఎంకే ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుంది. రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఇందుకోసం ధర్మాదాయ శాఖ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది’’ అని ముఖ్యమంత్రి స్టాలిన్(Tamil) వివరించారు.
We’re now on WhatsApp. Click to Join
“ప్రతి ఒక్కరికీ భిన్నమైన విశ్వాసాలు ఉంటాయి. వాటికి ద్రవిడ ప్రభుత్వ నమూనా ఎప్పుడూ ఆటంకం కాదు. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందరికీ అన్నీ అనే భావనపై ద్రావిడ నమూనా ఆధారపడి ఉంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘గ్లోబల్ ముత్తమిజ్ మురుగన్’ సదస్సు వివరాల్లోకి వెళితే.. మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మురుగన్ భక్తులను ఒకచోట చేర్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. మురుగన్ ప్రధాన సూత్రాలను వ్యాప్తి చేయడం, అర్థం చేసుకోవడం ఈ సమావేశం లక్ష్యం. మురుగన్‌కు చెందిన ఆరు పుణ్య క్షేత్రాలలో మూడోదిగా భావించే పళనిలో ఈ సదస్సు శనివారం, ఆదివారం జరగనుంది.
Also Read :Telangana Man : సౌదీ ఎడారిలో కరీంనగర్ యువకుడి దుర్మరణం
ఈ సదస్సులో పలువురు మేధావులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించి మురుగన్ గురించి మాట్లాడనున్నారు. ఇందులో భాగంగా ఫొటో ఎగ్జిబిషన్, 3డీ డిస్‌ప్లే, సెమినార్‌లు కూడా ఉంటాయి. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు విస్తృత వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వం తన “హిందూ వ్యతిరేక” ఇమేజ్‌ను తొలగించడానికి ఈ సదస్సును నిర్వహించిందని తమిళనాడు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాముడి పేరుతో బీజేపీ చేసే రాజకీయాలను ఎదుర్కోవడానికి డీఎంకే మురుగన్‌ను ప్రొజెక్ట్ చేయాలని చాలా మంది సూచిస్తున్నారు.