Jitta Balakrishna Reddy: బీఆర్ఎస్ పార్టీలో విషాదం.. జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత
స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన యువ తెలంగాణ పార్టీ (Yuva Telangana Party)ని స్థాపించి బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పార్టీలో కొనసాగుతున్నారు.
- Author : Gopichand
Date : 06-09-2024 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
Jitta Balakrishna Reddy: బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి (Jitta Balakrishna Reddy) కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు, జిట్టా కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.
స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన యువ తెలంగాణ పార్టీ (Yuva Telangana Party)ని స్థాపించి బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పార్టీలో కొనసాగుతున్నారు. జిట్టా స్వస్థలమైన భువనగిరికి ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు తరలించనున్నారు. అయితే ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం లేదా రేపు ఉదయం జరగనున్నట్లు తెలుస్తోంది. జిట్టా మృతి పట్ల ఉద్యమకారులతోపాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
జిట్టా రాజకీయ జీవితం
జిట్టా బాలకృష్ణ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని 2009లో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) వీడి ఇపుడు తిరిగి 2023 అక్టోబర్ 20న బీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. జిట్టా బాలకృష్ణా రెడ్డి 14 డిసెంబర్ 1972న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 1993లో LB నగర్ నుండి డివీఎం డిగ్రీ & పీజీ కళాశాల నుండి డిగ్రీ (బి.కామ్)తో గ్రాడ్యుయేషన్‌లో పూర్తి చేశాడు.
జిట్టా తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసిన ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టీడీపీకి ఆ స్థానం దక్కడంతో ఆయన ఆ పార్టీని విడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి వైఎస్ జగన్ లోక్‌సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని విడి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత గతేడాది తిరిగి బీఆర్ఎస్ చేరారు.