Food Poisoning : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30 నుండి బీఆర్‌ఎస్ గురుకుల బాట: కేటీఆర్
గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణం. 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని.. అయినా నిర్లక్ష్యం వీడటం లేదని ధ్వజమెత్తారు.
- By Latha Suma Published Date - 06:37 PM, Wed - 27 November 24

Brs Gurukula Bata Program : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలోని గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద సంఘటనల నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున “గురుకుల బాట” పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30 తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు “బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం” కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు.
గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారని తెలిపారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణం. 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని.. అయినా నిర్లక్ష్యం వీడటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోతలేదని ఎద్దేవా చేశారు. పాలనను గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో విద్యార్థులను పొట్టన బెట్టుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
మొదటి సంఘటన జరిగినప్పుడే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఉంటే ఇంత మంది విద్యార్థుల ప్రాణాలు పోయి ఉండేవి కాదన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఈ ముఖ్యమంత్రికి ఆ పిల్లల తల్లితండ్రులు కడుపుకోత కనిపించటం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవటం, కీలకమైన విద్యాశాఖను ఆయన తన దగ్గరే పెట్టుకొని నిర్లక్ష్యం చేస్తుండటం విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. పిల్లలకు సరైన అన్నం పెట్టటం, వారి బాగోగులు చూసుకోవటం కూడా చేతకాని దద్దమ్మ ప్రభుత్వమిదంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరితే బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రికి ఢిల్లీకి 28 సార్లు వెళ్లటానికి సమయం ఉంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చనిపోతుంటే కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించాలన్న సోయి లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు విద్యార్థులను పొట్ట పెట్టుకుంటున్న పాపపు పాలన అని మండిపడ్డారు. విద్యార్థుల చావులను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదవుకు దూరం చేసే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లైనా లేదా అని ప్రశ్నించారు.