Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ చీఫ్ ఆయనే ? బీసీ నేతకు బిగ్ ఛాన్స్ ?
తెలంగాణ బీజేపీ చీఫ్(Telangana BJP Chief) రేసులో భారీ పోటీ ఉన్నా.. ఒక నేత స్పష్టంగా ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.
- By Pasha Published Date - 05:50 PM, Mon - 10 February 25

Telangana BJP Chief: కాబోయే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. కొందరు పార్టీ ముఖ్య నేతలు ఈ రేసులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రామచంద్రరావు, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లను బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read :Mission South : ప్రధాని మోడీ ‘మిషన్ సౌత్’.. పవన్ ఏం చేయబోతున్నారు ?
మోడీ, అమిత్‌షా సీరియస్
తెలంగాణ బీజేపీ సారథి ఎంపిక అంశాన్ని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీరియస్‌గా తీసుకున్నారు. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంఛార్జిగా సీనియర్ నాయకురాలు శోభ కరంద్లాజేను నియమించారు. ఆమె రాష్ట్రంలో పర్యటించి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల అధ్యక్షులను సంప్రదించి, నూతన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయాలను సేకరిస్తారు. రాష్ట్ర పార్టీ సారధ్య బాధ్యతలను ఎవరికి అప్పగిస్తే మంచిదనే అంశాన్ని తెలుసుకుంటారు. ఆ వివరాలను నివేదికను రూపొందించి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు శోభ కరంద్లాజే అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగానే తెలంగాణ బీజేపీ ఎవరు కావాలనేది నడ్డా తేలుస్తారు. ఈక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
Also Read :Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా ?’’.. యూట్యూబర్ నీచ వ్యాఖ్యలపై దుమారం
ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేపథ్యం
తెలంగాణ బీజేపీ చీఫ్(Telangana BJP Chief) రేసులో భారీ పోటీ ఉన్నా.. ఒక నేత స్పష్టంగా ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. ఆయనే ఈటల రాజేందర్. గతంలో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న గొప్ప ట్రాక్ రికార్డు ఈటలకు ఉంది. బీఆర్ఎస్‌లో కుటుంబ ఆధిపత్యం కారణంగా అక్కడ ఈటల మనలేకపోయారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవు. దీంతో అక్కడ ఆయన బాగానే రాణించగలరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నరేంద్ర మోడీ, అమిత్‌షాలు కూడా ఈటలను బలమైన నాయకుడిగా చూస్తున్నారు. గతంలో పలుమార్లు అమిత్‌షా ఈవిషయాన్ని ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెప్పారు. బీసీలలోని ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటల రాజేందర్, ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన వారికే ఈసారి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించాలని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అయితే బీజేపీలోని ఓ వర్గం మాత్రం ఈటలకు వ్యతిరేకంగా పావులు కదుపుతోందని సమాచారం. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేపథ్యం కలిగిన వారికే తెలంగాణ బీజేపీ పగ్గాలు ఇవ్వాలని ఆ వర్గం కోరుతోందట. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత తెలంగాణ బీజేపీ సారథి ఎవరు అనే దానిపై ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఫిబ్రవరి మూడో వారంలో దీనిపై బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.