PV Narasimha Rao : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ నరసింహారావు విగ్రహం
తెలంగాణలో పీవీ నరసింహారావు(PV Narasimha Rao) జన్మించినందున ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- By Pasha Published Date - 01:33 PM, Mon - 12 May 25

PV Narasimha Rao : భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ నరసింహారావు విగ్రహాన్ని నిర్మించనున్నారు. పీ.వీ. నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ 2024 ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాసింది. ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లేదా తెలంగాణ భవన్‌లో పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరింది. పీవీ నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని తయారు చేయించాలని, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం విగ్రహం పక్కన ఉంచాలని పీ.వీ. నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ కోరింది. ఈ ఏడాది మార్చి 27న జరిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. తెలంగాణలో పీవీ నరసింహారావు(PV Narasimha Rao) జన్మించినందున ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Also Read :Buddha Jayanti : బుద్ధ జయంతి.. ప్రపంచాన్ని మేల్కొల్పిన బుద్ధుడి బోధనలివీ
నూతన తెలంగాణ భవన్.. కాంగ్రెస్ సర్కారు కసరత్తు
ఢిల్లీలో ప్రస్తుతమున్న తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్‌తో కలిసి ఉంది. అందుకే ప్రత్యేకంగా నూతన తెలంగాణ భవన్‌ను నిర్మించాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే పీవీకి కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి సర్కారు భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు ఆయన విగ్రహం ఏర్పాటుకు కూడా లైన్ క్లియర్ చేసింది. ఢిల్లీలో పీవీ విగ్రహాన్ని ప్రారంభించే కార్యక్రమంలో ప్రధాని మోడీ లాంటి దిగ్గజ బీజేపీ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. తద్వారా పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీయే ఎక్కువ గౌరవం ఇచ్చిందనే సంకేతాలను తెలంగాణ ప్రజల్లోకి పంపనున్నారు.
Also Read :Taliban Vs Chess : చెస్‌పై బ్యాన్.. తాలిబన్ల సంచలన నిర్ణయం.. ఎందుకు ?
1991లో పీవీ నరసింహా రావు ఎంపీ ఎలా అయ్యారంటే..
1991లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున గంగుల ప్రతాపరెడ్డి గెలిచారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచింది. రాజీవ్ గాంధీ చనిపోవడంతో పీవీ నరసింహా రావు ప్రధాని అయ్యారు. అయితే అప్పటికి ఆయన ఎంపీ కాదు. ప్రధాని అయిన వారు ఎంపీగా గెలవాలి. పీవీ కోసం గంగుల ప్రతాప రెడ్డి నంద్యాల స్థానం వదులుకున్నారు. పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఆ ఉప ఎన్నికలో పీవీకి 6 లక్షల 86 వేల 241 ఓట్లు వచ్చాయి. 89.48 శాతం ఓట్లతో ఆయన ఘన విజయం సాధించారు. రెండో స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన బంగారు లక్ష్మణ్‌కు 6.56 శాతం అంటే 45 వేల 944 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన ఎం.సుబ్బారెడ్డికి 20,398 ఓట్లు, మోత్కుపల్లి నరసింహులుకు 2524 ఓట్లు, ఆర్.కృష్ణమూర్తికి 1684 ఓట్లు, ఐకె రెడ్డికి 1599 ఓట్లు, జీకే రెడ్డికి 1456 ఓట్లు వచ్చాయి.