Telangana Temples: ఆలయాల అభివృద్ధికి నిధులు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- Author : HashtagU Desk
Date : 30-03-2022 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
కొడంగల్, మార్చి 30: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిధులను కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్ ఆదేశాలతో ఆలయాల అభివృద్ధికి విస్తృతమైన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వందల కోట్లతో ఆలయాలు అభివృద్ధి నిర్మాణాలు, వసతుల కల్పన చేపడుతున్నామని వివరించారు. గడిచిన ఏడేండ్లలో పలు ఆలయాల అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం అబ్బురపడేలా పునఃనిర్మించుకుని ప్రారంభించుకున్నామన్నారు. అదేవిధంగా వేములవాడ, బాసర, కాళేశ్వరం, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఆలయాలకు నిధులు ఇవ్వలేదన్నారు.
కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి బుధవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిదులు, అధికారులు తదితరులు ఉన్నారు.