AI : ఏఐ వల్ల ఉద్యోగులకు భద్రత లేదు – అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ
AI : ప్రస్తుతం మనం చేస్తున్న అనేక పనులకు రాబోయే కాలంలో తక్కువ మంది చాలు. కంపెనీలోని కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యలో గణనీయమైన కోత విధించే అవకాశముంది
- By Sudheer Published Date - 07:04 PM, Sun - 22 June 25
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ (Amazon CEO Andy Jassy) హెచ్చరించారు. జూన్ 17న కంపెనీలోని సుమారు 15 లక్షల మంది ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఆయన ఈ విషయం వెల్లడించారు. “ప్రస్తుతం మనం చేస్తున్న అనేక పనులకు రాబోయే కాలంలో తక్కువ మంది చాలు. కంపెనీలోని కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యలో గణనీయమైన కోత విధించే అవకాశముంది” అని ఆయన స్పష్టం చేశారు.
Isrel-Iran: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈ పరిణామం ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, డేటా ఎనలిటిక్స్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి క్లిష్ట పనులను కూడా ఏఐ ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాయని ఆయన అన్నారు. షాపింగ్ నుంచి ప్రయాణాల వరకు ఏఐ ఏజెంట్ల ఆధిపత్యమే భవిష్యత్తు అని జాస్సీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెజాన్‌లో వాడుతున్న 1000 పైగా జనరేటివ్ ఏఐ అప్లికేషన్లు, అలెక్సా వంటి స్మార్ట్ అసిస్టెంట్లు, గిడ్డంగుల నిర్వహణ, కస్టమర్ సర్వీస్ వ్యవస్థలన్నీ ఈ మార్పులనే సూచిస్తున్నాయని ఆయన తెలిపారు.
అయితే ఈ మార్పులను అవకాశంగా మలచుకోవాలని యాండీ జాస్సీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. “ఏఐని నేర్చుకోండి, శిక్షణ పొందండి, వర్క్‌షాప్‌లకు హాజరవండి. మార్పును అంగీకరించిన వారు కంపెనీలో ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు కలిగి ఉంటారు” అని సూచించారు. జనరేటివ్ ఏఐ వంటి టెక్నాలజీలు జీవితకాలంలో ఒకసారి మాత్రమే వచ్చేవని, ఇవి సమాజాన్ని, వ్యాపారాలను సమూలంగా మార్చే శక్తి కలవని జాస్సీ వ్యాఖ్యానించారు. అమెజాన్ భవిష్యత్‌లో ఏఐ కీలక పాత్ర పోషించనుందన్న విషయం ఆయన మాటలతో స్పష్టమవుతోంది.