Delhi Capitals: మళ్ళీ దంచికొట్టిన ఢిల్లీ.. వరుసగా రెండో విజయం
మహిళల ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ భారీ విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ సాధించిన ఆ జట్టు తాజాగా యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది.
- Author : Gopichand
Date : 08-03-2023 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
మహిళల ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ భారీ విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ సాధించిన ఆ జట్టు తాజాగా యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ లానింగ్, డాషింగ్ ఓపెనర్ షేఫాలీ వర్మ తొలి వికెట్ కు 6.3 ఓవర్లలోనే 67 పరుగులు జోడించారు. షేఫాలీ వర్మ 17 పరుగులకు ఔటైనా లానింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. భారీ షాట్లతో విరుచుకు పడింది. కేవలం 42 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 రన్స్ చేసింది. తర్వాత రోడ్రిగ్స్, జొనాసెన్ కూడా ధాటిగా ఆడారు. జొనాసెన్ 20 బంతుల్లో 42 , రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ 4 వికెట్లకు 211 పరుగులు చేసింది.
Also Read: MLC Kavitha: మహిళ రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి: కవిత పిలుపు
భారీ లక్ష్య చేధనలో యూపీ ఆరంభం నుంచే తడబడింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడిన కెప్టెన్ అలిసా హేలీ 24 పరుగులకు జాన్సెన్ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత గతమ్యాచ్ హీరో కిరణ్ నావగిరే 2 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగింది. తాహిలా మెక్‌గ్రాత్ మినహా మిగతావారు విఫలమయ్యారు. తాహిలా మెక్‌గ్రాత్ మాత్రం చివరి వరకూ పోరాడింది. కేవలన్ 50 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. యూపీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో జెస్ జొనాన్సెన్ మూడు వికెట్లు తీసింది.