Nitish Kumar Reddy: టీమిండియాలో మరో తెలుగుతేజం.. ఐపీఎల్ మెరుపులతో నితీశ్ కు ఛాన్స్
ఏపీకి చెందిన ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్ లో మెరుపులు మెరిపించడంతో నితీశ్ కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఆల్ రౌండర్ గా పలు మ్యాచ్ లలో ఆకట్టుకున్నాడు. నితీష్ 9 మ్యాచ్ లలో 239 రన్స్ చేశాడు.
- By Praveen Aluthuru Published Date - 10:47 PM, Mon - 24 June 24

Nitish Kumar Reddy: భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఏ స్థాయిలో పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించాలి..ఎంత రాణించినా కొంత సిఫార్సు కూడా ఉండాలి.. ఒక్కోసారి తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుందని తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత జాతీయ జట్టుకు ఎంపికవడం కాస్త సులభంగానే జరుగుతోంది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. తద్వారా ఆ లీగ్ ఏ లక్ష్యంతో బీసీసీఐ స్టార్ట్ చేసిందో అది నెరవేరుతోంది. తాజాగా జింబాబ్వే టూర్ కోసం పలువురు యువ ఆటగాళ్లు ఐపీఎల్ మెరుపులతోనే చోటు దక్కించుకున్నారు.
ఈ సారి ఏపీకి చెందిన ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్ లో మెరుపులు మెరిపించడంతో నితీశ్ కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఆల్ రౌండర్ గా పలు మ్యాచ్ లలో ఆకట్టుకున్నాడు. నితీష్ 9 మ్యాచ్ లలో 239 రన్స్ చేశాడు. అంతేకాదు బౌలింగ్ లోనూ 3 వికెట్లు తీశాడు. కొన్ని మ్యాచ్ లలో అతని హిట్టింగ్ సామర్థ్యం ఆకట్టుకుంది. ప్రస్తుతం జాతీయ జట్టులో హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే వంటి ఆల్ రౌండర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. వారి బాటలోనే ఆడుతున్న నితీశ్ కుమార్ కు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు టీమిండియాలో ప్రాతినిథ్యం దక్కడం అరుదుగా ఉంటోంది. వివిఎస్ లక్ష్మణ్ , అంబటి రాయుడు తర్వాత హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి జాతీయ జట్టుకు ఎంపికవడంతో తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్ లో అతనికి అరంగేట్రం చేసే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. జింబాబ్వే టూర్ లో రాణిస్తే భవిష్యత్తులో ఆల్ రౌండర్ కోటాలో భారత్ కు మరో ఆప్షన్ దొరికినట్టేనని చెప్పొచ్చు.
Also Read: T20 World Cup: రో”హిట్”…సూపర్ హిట్ ఆసీస్ ముందు భారీ టార్గెట్