Kohli Sledging: బెయిర్ స్టోతో కోహ్లీ మాటల యుద్ధం
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
- Author : Naresh Kumar
Date : 03-07-2022 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ జట్టుకు గంగూలీ దూకుడు నేర్పిస్తే.. ప్రత్యర్థి ఆటగాళ్లకు నోటితోనూ బదులు చెప్పడం కోహ్లీనే నేర్పించాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టులో కోహ్లీ స్లెడ్జింగ్ కు దిగాడు. ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో బెయిర్ స్టో క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఫస్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి స్లెడ్జింగ్ కు పాల్పడటం మ్యాచ్ కు హైలైట్ గా మారింది. రెండో రోజు మ్యాచ్ లో షమీ బౌలింగ్ లో బెయిర్ స్టో షాట్స్ కొట్టేందుకు ప్రయత్నిస్తూ పలుమార్లు విఫలమయ్యాడు. దీంతో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి బెయిర్‌స్టోను చూసి నవ్వుకున్నాడు.
ఈ క్రమంలో కోహ్లి న్యూజిలాండ్ పేసర్ టీమ్ సాథీ పేరును ఉపయోగిస్తూ అతడి కంటే వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు కదూ అంటూ బెయిర్ స్టో పై కామెంట్స్ చేశాడు. కోహ్లి కామెంట్స్ కు బెయిర్ స్టో సీరియస్ కావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో అంపైర్ తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మూడో రోజు మరోసారి విరాట్ తన నోటికి పనిచెప్పాడు. బెయిర్ స్టోపై మళ్లీ స్లెడ్జింగ్ చేశాడు. తర్వాత బూమ్రా బౌలింగ్ లో కూడా భారీ షాట్స్ కోసం ట్రై చేసిన బెయిర్ స్టో విఫలమయ్యాడు. అదే సమయంలో కోహ్లి అతడిపై కామెంట్స్ చేశాడు. ఆ మాటలకు కోహ్లి వైపు బెయిర్ స్టో కోపంగా చూస్తూ కనిపించాడు. అతడి చూపులను లెక్క చేయకుండా నోరు మూసుకొని బ్యాటింగ్ పై దృష్టిపెట్టూ అంటూ కోహ్లి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW
— Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022