షమీపై బీసీసీఐ స్టాండ్ ఇదేనా?
షమీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2025 మార్చిలో ఆడారు. అప్పటి నుండి గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆయన జట్టులో చోటు కోల్పోయారు.
- Author : Gopichand
Date : 31-12-2025 - 6:55 IST
Published By : Hashtagu Telugu Desk
Mohammed Shami: భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. సుదీర్ఘ కాలంగా మైదానానికి దూరంగా ఉన్న షమీ.. మళ్లీ నీలి రంగు జెర్సీని ధరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సెలెక్టర్లు ఆయన్ని ప్రతి ఫార్మాట్ నుండి పక్కన పెట్టడంతో షమీ కెరీర్ ముగిసినట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బీసీసీఐ (BCCI) వర్గాల తాజా సమాచారం ప్రకారం.. షమీ ఇప్పటికీ బోర్డు భవిష్యత్తు ప్రణాళికల్లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు.
సెలక్షన్ రడార్‌లోనే షమీ
షమీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2025 మార్చిలో ఆడారు. అప్పటి నుండి గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆయన జట్టులో చోటు కోల్పోయారు. ఈ ఏడాది టీమ్ ఇండియా ఆడిన పలు కీలక సిరీస్‌లలో షమీ పేరు లేకపోవడంతో 2027 వన్డే ప్రపంచ కప్ కోసం మేనేజ్‌మెంట్ కొత్త కుర్రాళ్ల వైపు మొగ్గు చూపుతోందని భావించారు.
కానీ బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఎన్డీటీవీతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. “షమీ సెలక్షన్ రడార్ నుండి ఏమాత్రం తప్పుకోలేదు. ప్రస్తుతం ఆయన దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శనను మేము నిశితంగా గమనిస్తున్నాము. ఆయన అనుభవం జట్టుకు ఎంతో అవసరం” అని స్పష్టం చేశారు. దీంతో షమీ అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
Also Read: ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్షలు తప్పవు!
న్యూజిలాండ్ సిరీస్‌తో రీ-ఎంట్రీ?
ప్రస్తుత సమాచారం ప్రకారం.. త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ ద్వారా షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఆయన ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన వేదిక కానుంది. సెలెక్టర్లు ఆయన్ని నేరుగా కాకుండా దేశవాళీ మ్యాచ్‌లలో ఆయన లయను పరీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
2027 ప్రపంచ కప్ ప్రణాళికలు
భారత జట్టు మేనేజ్‌మెంట్ 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ పేసర్లకు తోడుగా షమీ వంటి అనుభవం ఉన్న బౌలర్ ఉంటే జట్టు బలం రెట్టింపు అవుతుందని బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో షమీకి ఉన్న వికెట్లు తీసే సామర్థ్యం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్.