Team India: టెస్ట్ కెప్టెన్సీ పోటీలో ఎవరు ముందుంటారు? రాహుల్, బుమ్రా, గిల్, పంత్ మధ్య గట్టి పోటీ
రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత భారత జట్టు ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే — తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరు?
- By Kode Mohan Sai Published Date - 02:10 PM, Fri - 16 May 25

రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత భారత జట్టు ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా రోహిత్ జట్టుకు నాయకత్వం వహించగా, కోహ్లీ నాయకత్వంలో భారత్ విదేశాలలో 24 టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన గొప్ప రికార్డు ఉంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే — తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరు?
ఈ ప్రశ్నకు నాలుగు మంది ముఖ్యమైన పోటిదారులున్నారు — జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్. వీరిలో ఎవరి వద్ద ఏమేమి బలాలు ఉన్నాయో, ఎవరు భారత టెస్ట్ జట్టుకు తగిన నాయకుడు అవుతారో పరిశీలిద్దాం.
జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలో భారత్ ఒక మ్యాచ్ గెలిచింది కూడా. కానీ అతనికి ప్రధాన అడ్డంకి అతని శారీరక స్థితి. తరచుగా గాయాలు రావడం వల్ల అతన్ని శాశ్వత కెప్టెన్‌గా నియమించడం ప్రమాదకరంగా మారుతుంది. తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జట్టుకు వేరే నాయకుడిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రిషబ్ పంత్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో సెంచరీలు కొట్టిన ఏకైక భారత వికెట్ కీపర్. కానీ అతని ఆటశైలి ప్రమాదకరంగా ఉంటోంది — ఇది నాయకత్వంలోనూ ప్రతిబింబించవచ్చు. జాతీయ స్థాయిలో అతనికి ఇప్పటివరకు నాయకత్వ అనుభవం లేకపోయినా, దేశీయ టోర్నీలు మరియు ఐపీఎల్ లో కెప్టెన్సీ చేశాడు.
శుభ్‌మన్ గిల్ యువ నాయకత్వానికి ప్రతీక. అతను 24 సంవత్సరాల వయస్సులోనే వన్డేలు, టి-20 ఫార్మాట్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అతనిలో భవిష్యత్తులో ప్రధాన నాయకుడిగా మారే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతన్ని ఇప్పటినుంచే వైస్ కెప్టెన్ గా చేసి క్రమంగా పూర్తి బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఒక దీర్ఘకాలిక నాయకత్వాన్ని రూపొందించవచ్చు. అతని సాంకేతికత, స్థిరత్వం, మానసిక బలంతో అతను జట్టుకు ఒక మంచి ఎంపికగా నిలుస్తాడు.
కేఎల్ రాహుల్ అనుభవజ్ఞుడు, నిశ్చలత కలిగిన వ్యక్తి. మూడు టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించి వాటిలో రెండు విజయం సాధించాడు. అతని విదేశీ మైదానాల్లో ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా వంటి కఠినమైన పరిస్థితుల్లో సెంచరీలు చేయగలిగిన ఆటగాడు. అతనిలో స్థిరమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తాత్కాలిక స్థిరత కోరుకుంటే రాహుల్‌ను కెప్టెన్ చేసి, గిల్‌ను అతని నేతృత్వంలో తీర్చిదిద్దవచ్చు.
ఇప్పుడు నిర్ణయం త్వరలోనే రావొచ్చు. భారత జట్టు జూన్ నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 న తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. పర్యటన ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. తదుపరి కెప్టెన్ ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. భారత క్రికెట్ అనుభవాన్ని నమ్ముకుంటుందా, లేక భవిష్యత్తును ఎంచుకుంటుందా అన్నది ఆ నిర్ణయంతో తేలనుంది.