South Africa: సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి.. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా..!
- By Gopichand Published Date - 09:44 AM, Thu - 27 June 24

South Africa: టోర్నీ ఆరంభం నుంచీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ పోరాటానికి తెరపడింది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. సూపర్ 8 వరకూ దాదాపు అన్ని మ్యాచ్ లలో గట్టిపోటీనిచ్చిన ఆఫ్ఘన్లు కీలక మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. సఫారీ బౌలింగ్ ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. సఫారీ పేసర్ల దెబ్బకు కేవలం 56 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలింది. స్పిన్నర్లతో మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పిచ్ పేసర్లకు చక్కగా సహకరించడంతో సఫారీ బౌలర్లు చెలరేగిపోయారు. సౌతాఫ్రికా పేస్ త్రయం మార్కో జెన్సన్, రబాడ , నోర్జే ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. పవర్ ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ 28 పరుగులే చేసి 6 వికెట్లు చేజార్చుకుంది.
Also Read: Russia Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది బోగీలు
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కేవలం ఒకే ఒక్క బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ సాధించగా… మిగిలిన వారంతా సింగ్ డిజిట్ కే ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ కు 11.5 ఓవర్లలోనే తెరపడింది. సఫారీ బౌలర్లలో జెన్సన్ 3 , షంషి 3, రబాడ 2, నోర్జే 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత ఛేజింగ్ లో సౌతాఫ్రికా 5 పరుగులకే డికాక్ వికెట్ కోల్పోయినప్పటకీ హెండ్రిక్స్, మార్క్ రమ్ ధాటిగా ఆడి జట్టు విజయాన్ని పూర్తి చేశారు. సఫారీ టీమ్ 8.5 ఓవర్లలో టార్గెట్ ఛేదించగా.. హెండ్రిక్స్ 29 , మార్క్ రమ్ 23 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ విజయంతో సౌతాఫ్రికా తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.
We’re now on WhatsApp : Click to Join