Gautam Gambhir: రాజీ పడేదే లేదు… జట్టు ఎంపికలో గంభీర్ మార్క్
Gautam Gambhir: కోచ్ గా బాధ్యతలు చేపట్టకముందే బీసీసీఐకి కొన్ని కండీషన్లు పెట్టిన గౌతమ్ గంభీర్ వాటిని అమలు చేయడంలోనూ స్ట్రిక్ట్ గానే ఉన్నాడు. ముఖ్యంగా జట్టు ఎంపికలో రాజీ పడేది లేదని ముందే తేల్చేశాడు. ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఆ ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు
- By Praveen Aluthuru Published Date - 11:19 PM, Wed - 11 September 24

Gautam Gambhir: ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో చోటు దక్కాలంటే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ప్రదర్శనే ప్రామాణికం… రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, వినూ మన్కడ్ వంటి టోర్నీల్లో ఆయా ఆటగాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే జాతీయ జట్టు ఎంపిక జరిగేది.. కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత జాతీయ జట్టులోకి చాలా మంది ప్లేయర్స్ చాలా ఈజీగా ఎంపికవుతున్నారు. ఒకవిధంగా ఇది మంచిదే అయినప్పటకీ మరోవిధంగా మాత్రం నష్టమే. ఎందుకంటే ఐపీఎల్ ప్రదర్శన కంటే దేశవాళీ క్రికెట్ లో ఆటతీరే ప్లేయర్స్ ఎంపికకు ప్రామాణికంగా ఉండాలి. ఈ విషయంలో కొత్త కోచ్ గంభీర్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు.
కోచ్ గా బాధ్యతలు చేపట్టకముందే బీసీసీఐ(BCCI)కి కొన్ని కండీషన్లు పెట్టిన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వాటిని అమలు చేయడంలోనూ స్ట్రిక్ట్ గానే ఉన్నాడు. ముఖ్యంగా జట్టు ఎంపికలో రాజీ పడేది లేదని ముందే తేల్చేశాడు. ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఆ ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు. బీసీసీఐ కూడా సీనియర్ ప్లేయర్స్ కు దీనిపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కోహ్లీ, రోహిత్ , బూమ్రాలకు కాస్త వెసులుబాటు ఇచ్చినా మిగిలిన ఆటగాళ్ళ విషయంలో మాత్రం గంభీర్ ఈ రూల్ నే పాటించాడు.
తాజాగా బంగ్లాదేశ్ తో సిరీస్ ఎంపికలో మరోసారి ఇది రుజువైంది. జట్టుకు ఎంపికయ్యే వారిలో చాలా మంది పేర్లు ముందే ఊహించినప్పటికీ దేశవాళీ క్రికెట్ ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఊహించని విధంగా యూపీ లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ ఎంపిక ఈ కోవలోకే వస్తుంది. గత కొంతకాలంగా దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ సెలక్టర్లను ఆకట్టుకున్న యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే సమయంలో దులీప్ ట్రోఫీలో నిరాశపరిచిన శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్లను సెలక్టర్లు అసలు పరిగణలోకి తీసుకోనే లేదు. ఇక రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వైట్ బాల్ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ దులీప్ ట్రోఫీలో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా టెస్ట్ ఫార్మాట్ లోకి కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే స్టార్ పేసర్ బూమ్రా ఎంపిక కాస్త ఆశ్చర్యమే.. ఎందుకంటే న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా లాంటి టాప్ టీమ్స్ తో వరుస సిరీస్ లు ఉండడంతో బూమ్రాకు రెస్ట్ ఇస్తారని భావించినా గంభీర్ మాత్రం మొగ్గుచూపలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ వరకూ ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లే ఉండడంతో బంగ్లాతో సిరీస్ బూమ్రాకు ప్రాక్టీస్ లా ఉపయోగపడుతుందని భావించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద జట్టు ఎంపికలో గంభీర్ తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నాడని చెప్పొచ్చు.
Also Read: PM Modi Ganpati Pooja: సీజేఐ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ