Sanju Samson: ఐపీఎల్ 2026 మెగా వేలం.. ఢిల్లీలోకి సంజు శాంసన్?!
వెంకటేశ్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోకుండా అతన్ని వేలంలోకి పంపాలని KKR యోచిస్తోంది. దీని ద్వారా లభించే పర్స్ మనీతో కామెరూన్ గ్రీన్ కోసం భారీ బిడ్ వేయాలని ఫ్రాంఛైజీ ఆశపడుతోంది.
- By Gopichand Published Date - 09:55 PM, Sat - 1 November 25
Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 మెగా వేలానికి ముందు ఆటగాళ్ల ట్రేడింగ్ మార్కెట్ వేడెక్కింది. రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు కీలక ఆటగాళ్ల మార్పిడిపై చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. RR కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson), DC స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ ఈ ట్రేడ్ డీల్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నారు. సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం దాదాపుగా ఖాయం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని తమ జట్టులోకి తీసుకోవడానికి తీవ్ర ఆసక్తి చూపుతోంది. అయితే DC తమ ముఖ్య ఆటగాళ్లను వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో చర్చలు నెమ్మదిగా సాగుతున్నాయి.
కేఎల్ రాహుల్‌ను వదులుకోని DC
శాంసన్, స్టబ్స్ మార్పిడి చర్చల మధ్య RR యాజమాన్యం DC జట్టులోని కేఎల్ రాహుల్‌ను తమ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే గత సీజన్‌లో DCకి కీలకంగా వ్యవహరించిన రాహుల్‌ను వదులుకోవడానికి ఫ్రాంఛైజీ నిరాకరించింది. ట్రిస్టన్ స్టబ్స్‌ను తీసుకునేందుకు RR అంగీకరించినప్పటికీ అతనితో పాటు మరొక అన్‌క్యాప్డ్ ఆటగాడిని కూడా ఇవ్వాలని పట్టుబట్టింది. దీనికి కూడా DC తిరస్కరణ చెప్పింది. ఈ పరిణామాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే సంజూ శాంసన్ తదుపరి IPL సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో కనిపించే అవకాశం బలంగా ఉంది.
రాహుల్‌ను దక్కించుకోవాలని KKR ప్రయత్నాలు
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యం తమ ప్రధాన లక్ష్యాన్ని కేఎల్ రాహుల్‌పైనే కేంద్రీకరించింది. KKRకు ఒక నమ్మకమైన కెప్టెన్, టాప్ ఆర్డర్ బ్యాటర్ అవసరం ఉంది. కొత్త ప్రధాన కోచ్ అభిషేక్ నాయర్, రాహుల్‌ల మధ్య ఉన్న అనుబంధం కారణంగా రాహుల్‌ను జట్టులోకి తీసుకురావాలని KKR యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఈ డీల్‌లో రాహుల్‌కు బదులుగా KKR ఏ ఆటగాడిని ట్రేడ్ చేస్తుందనేది పెద్ద చిక్కుముడిగా మారింది.
Also Read: Satellite CMS: అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్‌డౌన్!
KKR ముందు ట్రేడింగ్ సవాళ్లు
ప్రస్తుత పరిస్థితుల్లో KKR వద్ద DC ఆసక్తి చూపడానికి అవకాశం ఉన్న పెద్ద ఆటగాళ్లు లేకపోవడం KKR ముందున్న ప్రధాన సమస్య. సీనియర్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ పేరు చర్చకు వచ్చినా, ఢిల్లీ క్యాపిటల్స్ భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. KKR జట్టులో నిలకడగా రాణిస్తున్న రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి మాత్రమే ట్రేడ్ చేయడానికి అర్హత ఉన్నప్పటికీ వారిని జట్టు నుంచి పంపే అవకాశం చాలా తక్కువ. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన వెంకటేశ్ అయ్యర్ డిమాండ్ తగ్గింది.
కామెరూన్ గ్రీన్ కోసం వెంకటేశ్ బలి?
వెంకటేశ్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోకుండా అతన్ని వేలంలోకి పంపాలని KKR యోచిస్తోంది. దీని ద్వారా లభించే పర్స్ మనీతో కామెరూన్ గ్రీన్ కోసం భారీ బిడ్ వేయాలని ఫ్రాంఛైజీ ఆశపడుతోంది. గ్రీన్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి KKR దూకుడుగా వ్యవహరించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ DC, RR మధ్య శాంసన్-స్టబ్స్ ట్రేడ్ డీల్ పూర్తయితే కేఎల్ రాహుల్‌ను దక్కించుకోవడానికి KKR మరింత తీవ్రంగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ ట్రేడ్ విండో ఐపీఎల్ 2026 వేలానికి ముందు జట్ల కూర్పును పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది.